18, జూన్ 2024, మంగళవారం

శ్రీరాము డెవ్వరో చెప్పండి


శ్రీరాము డెవ్వరో చెప్పండి మాకు 
    శ్రీరాముని మహిమ తెలుపండి
ఆరాముని గొలిచి ఫలమేమి భక్తు 
    లందుకొనవచ్చునో తెలుపండి

సాకేతపురమేలు వాడండి వాడు
    సర్వలోకములేలు వాడండి
లోకాధిపులు పొగడు వాడండి సకల
     లోకసన్నుతుడగు వాడండి
లోకపావనుడైన వాడండి సకల
    శోకనాశనుడైన వాడండి
ఆకాశవర్ణంబు వాడండి వాడు
    లోకపోషకుడైన హరి యండి

శ్రీహరియె రాముడని తెలియండి తెలిసి 
    శ్రీరాముని మీరు కొలవండి
ఊహింహ శ్రీరామమాహాత్మ్య మజుని 
    యూహకైనను తెలియ రాదండి
దేహధారులకెల్ల శ్రీరామనామ 
    దివ్యమంత్రమె చాలు తెలియండి
మోహాదులను గోసి రామయ్య మనకు
    మోక్షఫల మిచ్చునని తెలియండి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.