19, జూన్ 2024, బుధవారం

రామనామ మనే


రామనామ మనే దివ్యరత్నము దొరకె
శ్రీమంతుడ నైతి నండి చిత్రము గాను

చిత్తుజేయు నది లోకపు సిరులన్నిటిని
హత్తుకొని నానాలుక నదియుండగ
నెత్తుకపోలేరు దొంగ లెవ్వరు దాని
నెత్తుకపోలేరు రాజు లెవ్వరు గాని

దిశలను వెలిగించు దాని దివ్యతేజము
కుశలము కలిగించు దాని దివ్యవిభూతి
యశమును కలిగించు దాని యద్భుతశక్తి
వశముచేయు మోక్షరాజప్రాసాదమును

ఆరత్నము కలిమిచేత నందరి కంటె
భూరిభాగ్యశాలి నైతి భూజనులార
కోరదగిన దేది నాకు కువలయ మందు
శ్రీరాముని పాదములను చేరుకొందును


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.