పళనిస్వామి గారికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో ఆయన రకరకాల వంటల గురించి వీడియోలు పెడుతూ ఉంటారు.
పేరు పళనిస్వామి అనగానే ఆయన తమిళుడు అని సూచనగా తెలుస్తోంది కదా. అవును తమిళుడే.
ఐతే ఆయన పెట్టే వీడియోలు అన్నీ తెలుగులో ఉంటాయి.
తెలుగంటే అలాంటిలాంటి తెలుగు కాదు. ఆయన వీడియోల్లో ఇంగ్లీషు మాటలు మచ్చుకైనా కనిపించవు.
పూర్తిగా తెలుగే మాట్లాడుతూ చేస్తారాయన వీడియోలని.
ఆయన రాజమహేంద్రవరం నుండి చేస్తున్నారు వీడియోలను. వారి కుటుంబం చాలా కాలం క్రిందటనే తెలుగు నేల మీద స్థిరపడినట్లు తోస్తుంది.
ఈ వంటల వీడియోలతో నాకేం పనీ అనవచ్చును మీరు.
పని ఉంది కదండీ.
ఇప్పుడు నేను మాశ్రీమతికి పూర్తిసమయం సహాయకుడిని కదా. ఇంగ్లీషులో చేప్పాలంటే full-time maid అన్నమాట. డయాలసిస్ సెంటర్ వాళ్ళైతే నన్ను అటెండర్ అంటారు.
ఈకొత్త ఉద్యోగబాధ్యతలో భాగంగా ఆవిడ యూట్యూబ్ వీడియోలు చూస్తున్నా ఓటీటీల్లో టీవీసీరియళ్ళు చూస్తున్నా నోరుమూసుకొని (pun intended) అవన్నీ చూస్తూ కూర్చుని ఉండాలి.
అలా పళనిస్వామి గారి వంటల ఛానెల్ కూడా చూస్తున్నా నన్నమాట.
పళనిస్వామి గారి ఛానెల్ నాకు నచ్చింది.
అంటే ఆమాట ఆయన వంటల గురించి చెప్పటానికి అనటం లేదు. ప్రస్తుతానికి వంటింట్లో సహాయకుడినే కాని వంటవాడిని కాను కాబట్టి ఆవంటల బాగోగుల గురించి ఏమీ సాధికారిక వ్యాఖ్యలు చేయలేను.
కాని ఆయన తెలుగు గురించి మాత్రం తప్పకుండా చెప్పగలను.
మిక్కిలి కర్ణపేయమైన స్వఛ్ఛమైన తెలుగుభాషలో చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు పళనిస్వామి గారు.
చక్కని మాటతీరు, వినసొంపైన భాష అనే రెండింటికి తోడు మంచి కంఠస్వరం. ఇంకేం కావాలి మనకు ఎంతైనా వినబుధ్ధి కావటానికి?
నిజం చెప్పాలంటే కొందరు ప్రవచనకర్తలకూ అంత చక్కగా ఆకట్టుకొనేలా మాటలాడటం రాదు. ఆకట్టకొనేలా మాటలాడటం కూడా ఒక మంచి కళయే.
ఒకప్పుడు ఒక హోమియోపతి వైద్యం గురించిన గ్రంథం leaders in homeopathic therapists అని Dr E.B.Nash గారిది మానాన్నగారి దగ్గర ఉండేది. నాకు హోమియోపతి గురించి ఆట్టే తెలియకపోయినా అంతగా ఆసక్తి కూడా లేకపోయినా డాక్టరు గారి అందమైన ఇంగ్లీషు కారణంగా ఆపుస్తకాన్ని తరచూ చదివేవాడిని.
అలాగే వంటల గురించి కాకపోయినా పళనిస్వామి గారి హాయిగొలిపే తెలుగును వినటానికైనా ఆయన ఛానెల్ లోని వీడియోలు వినవచ్చు.
అనేకమంది వంటల వీడియోలను గమనిస్తున్నాను. పేరుకు తెలుగు లోనే ఐనా వాటి నిండా రాళ్ళవాన లాగా ఇంగ్లీషు మాటలే. నాకు తిక్కపుట్టే విషయం ఏమిటంటే ఆ ఇంగ్లీషు కూడా తప్పులతడకలే.
ఆసక్తి కలవారు ఆయన ఛానెల్ చూడండి.
పళని స్వామి గారు కేవలం వంటల కోసమే కాదు .. మానవ సంబంధాలు.. వ్యక్తిత్వ అంశాలు కూడా చెపుతారు .. ఆయన ఉండేది మా రాజమహేంద్రవరం లోనే .. ఆయనను ప్రత్యక్షంగా కలిసే భాగ్యం కలిగింది. ఆయన కథ వింటే మనసు ద్రవీకరిస్తుంది కూడానూ
రిప్లయితొలగించండిఈమధ్యనే పళనిస్వామి గారి ఛానెల్ చూడటం జరిగిందండీ. ఆయన తెలుగు బ్రహ్మాండం. ఆయన గురించిన వివరాలు తెలియవండీ. నిజమే, ఆయన ఛానెల్ లోపల కొన్ని ఆధ్యాత్మిక విషయాల వీడియోలూ కనిపించాయి నిన్న నాకు.
తొలగించండితల్లి కావేరి పాటల(రాగాల) పుట్టిల్లు అమ్మ గోదారి మాటల పుట్టిల్లు.
రిప్లయితొలగించండినాకు శ్రవణమాధ్యమానికి సగమెరిక. చుక్కెదురు. :)
పళనిస్వామిగారు పక్కా ఆరణాల ఆంధ్రుడే.
రిప్లయితొలగించండిపదహారణాల అనాలండీ!
తొలగించండి