15, జులై 2019, సోమవారం

ఆంధ్రౌన్నత్యం - నేటి స్థితి


ఈనాడు (7/11/2019)న నాకు తెలిసిన లోకం బ్లాగు వారు ఆంధ్రౌన్నత్యం అనే టపా ప్రకటించారు. అందులో పద్యాలు 10934 నాటివి. బాగున్నాయి. నాస్పందన అక్కడ వ్రాసాను. అది ఈబ్లాగులో ఒకటపా రూపంలో భద్రపరిస్తే బాగుంటుందని భావిస్తున్నాను.

మధ్యాక్కర.
ఒకనాటి యౌన్నత్యములను గూర్చినేడూరక పలుక
ప్రకటిత మగునవి నేటి మన డొల్ల బ్రతుకులే కనుక
నికనైన పూర్వవైభవము సాధించ నిప్పటి వారు
చకచక ధృఢదీక్ష బూని ముందుకు సాగుటే మేలు

తే.గీ. నోరు నొవ్వంగ గతకీర్తి నుడివి నుడివి
సమయమును వ్యర్థపరచుట చాలు చాలు
మరల సత్కీర్తిసాధించు మార్గమేదొ
యరసి గెలిచిన గర్వించు నాంధ్రమాత!

ద్విపద.
బాలచంద్రుని గూర్చి బ్రహ్మన్న గూర్చి
కాలోచితము కాదు లోలోన మురియ
రాణి రుద్రమ గూర్చి రాయల గూర్చి
ఆనందపడిన కార్యము తీరబోదు
నీవేమి యొనరించి నీ జాతి కీర్తి
బావుటా నెగిరింతు వది ముఖ్యమయ్య
పాతగొప్పల నింక పాతరవేసి
ఖ్యాతి మీఱిన నాంద్రమాత గర్వించు

5 కామెంట్‌లు:

 1. చాలా బాగా చెప్పారు, శ్యామలరావు గారూ. భూతకాలం నుండి వర్తమాన కాలంలోకి వచ్చి చెయ్యవలసిన పనులు సక్రమంగా సకాలంలో చేస్తే భవిష్యత్తు బాగుండాలని కి దోహదపడుతుంది.

  పైన మీరు చెప్పిన బ్లాగ్ లో మీరు వ్రాసానన్న స్పందన కనిపించలేదే? No comments అనే చూపిస్తోంది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విన్నకోట వారు, మీ స్పందనకు ధన్యవాదాలు. వర్తమానంలో కాక గతంలో జీవించే మానసికస్థితి చేటుతెస్తుంది. 'నాకు తెలిసిన లోకం' బ్లాగు వారు నా స్పందనను ప్రకటించలేదు. ఇంకా వారు నా స్పందనను ఇంకా చూడలేదో లేదా తిరస్కరించారో తెలియదు.
   ఫరవాలేదు. ఆ స్పందన తాలూకు పద్యాలు పదిలపరచుకున్నాను కదా.

   తొలగించండి
 2. గతము చరిత్ర , దానిగనిగాని _ యెఱుంగము మంచి సెబ్బరల్ ,
  చతురమతుల్ చరిత్ర గత చర్యల స్ఫూర్తిని వర్తమానమున్
  మతిని నవీకరించుకొని మాన్యతతో చరియింత్రు , దీన సం
  స్తుతయుత జీవనోన్నతులు శోభిలు మానవ జాతి కెంతయున్ .

  రిప్లయితొలగించండి
 3. గతం నుండి స్ఫూర్తి పొందాలి, గతంలో జరిగిన పొరపాట్ల నుండి పాఠం నేర్చుకుని అవి పునరావృతం కాకుండా చూసుకుంటూ ముందుకు సాగాలి. అలా కాకుండా పూర్తిగా గతంలోనే బతకడం మాత్రం సరి కాదు.

  ప్రసక్తి వచ్చింది కాబట్టి గుర్తు చేసుకుందాం ... గతవైభవాన్ని శ్లాఘిస్తూ విశ్వనాథ సత్యనారాయణ గారు "ఆంధ్ర ప్రశస్తి" వ్రాశారు కదా. మరోసారి చదువుకోవాలంటే ఈ క్రింది లింక్ లో దొరుకుతుంది.

  ఆంధ్ర ప్రశస్తి (విశ్వనాధ సత్యనారాయణ)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విన్నకోటవారు, విశ్వనాథవారి ఆంధ్రప్రశస్తిని పంపినందుకు ధన్యవాదాలు. మంచికృతి. అందరూ ఒకసారి చదివి ఆనందించాలి. కాని అక్కడితో ఆగకుండా వచ్చేతరాలకు మనం కూడా ఆంధ్రప్రశస్తిని ఎలా ఇనుమడింప జేయగలమా అని యత్నించాలని నా అభిలాష.

   తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.