16, జులై 2019, మంగళవారం

పదుగురిలో నేను పలుచన కానేల


పదుగురిలో నేను పలుచన కానేల
నది నీకు హితవైన నటులే కానీ

నిదుర లేచిన దాది నిన్నెంచు మనసు
పెదవుల కొసల నీ పేరులె చిందులాడు
అది పరధ్యానమని యనుకొను లోకము
వదలక గేలిసేయ పడిపడి నవ్వెదవా

వెలలేని నీచిరు నవ్వులు చాలు నాకు
తులలేని నీ కొలువు దొరకెనుగా నాకు
సులువుగ మందిలో కలువకున్నాడని
నలుగురు నవ్విన నవ్వెదవా నీవు

నా రాముడే చాలు నాకని నమ్మితి
పేరు నూరు లేకున్న పెద్దగ చింత లేదు
వీరు వారు నేడు నన్నూఱక దూఱిన
నౌరా నీవును నవ్వ నైనదిగా బ్రతుకు

3 కామెంట్‌లు:

  1. మనం పదుగురిలో పలుచనైతే చాలామందికి హితవుగానే ఉండడం లోకరీతే కదా శ్యామలరావు గారూ..
    పద్యాలు బాగున్నాయి, అయితే ఎవరినుద్దేశించి? నవ్వుతున్నదెవరు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యాలు అని పొరబడుతున్నారు అప్పుడప్పుడూ కొందరు. ఇప్పుడు మీరూ వారిలాగే పొరబడ్డారు. ఇది రాములవారి నుద్దేశించిన కీర్తన. పద్యాలు కావు, ఆ కీర్తనలోని చరణాలు. ఎవరినీ ప్రత్యేకించి ఉద్దేశించినది కాదండి. భక్తుని మానసికస్థితిని లోకం అంచనా వేయటంలో పొరబడటం గురించినది ఈకీర్తన.

      తొలగించండి
  2. రాముడు రాచబిడ్డ , మహరాజు , ప్రజాపరిపాలనా విధిన్
    భామిని గూడ వీడిన స్వభావము , దీనుల పట్ల రక్షయే
    స్వామి వహించుగాని , పలుచన్ గనుటేమి , హసించుటేమి , ఆ
    మోము గభీర ధీర శుభ మూర్తి సమన్విత నిర్వికల్పమే !

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.