11, జులై 2019, గురువారం

నీరు గాలి నిప్పులతో


నీరు గాలి నిప్పులతో నేల మట్టిని
చేరిచి ఒక బొమ్మను చేసి విడచెను

అది యీ స్థల కాలంబుల నాడే నాడే
నిదిగో పదిమంది ముం దింపు గాను
అదుపు లేక నాడిపాడు నంతే గాని
కుదురు లేదు బెదురు లేదు కొంచమైన

అప్పుడప్పు డా బొమ్మ యాటతప్పుచో
తప్పుడు తాళములు వేసి దారితప్పుచో
తప్పక యపు డాటగాడె తలదూర్చెను
తప్పొప్పుల విడమరచి దారి చూపెను

ఆటగాడె రాముడనగ నవతరించగ
ఆటగాడె కృష్ణుడగుచు నవతరించగ
మేటిబొమ్మ యిది యెఱిగి మేలు కాంచగ
ఆట మిగిలియున్న బొమ్మ లాడుచుండెను

2 కామెంట్‌లు:

 1. ఈ కీర్తన భావం బాగుందండీ !

  నాకు ఒక సందేహం..మీరు వ్రాసే కీర్తనలు పాడాలంటే కుదురుతుందా ? ఇవి రాగయుక్తాలేనా ? అంటే ఫలానా రాగం లో వ్రాస్తున్నారా లేక పద్యాలా ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. మీకు ఈకీర్తన నచ్చినందుకు సంతోషం. మీరు ఈ రామసంకీర్తనాన్ని గమనికతో పరిశీలిస్తున్నందుకు ధన్యవాదాలు. రామానుగ్రహ ప్రాప్తిరస్తు.

   ఇవి పద్యాలు కావండీ. కీర్తనలే. కీర్తనలు పాడటానికి వీలుగానే ఉంటాయండీ. ఏదో ఒక బాణీలో అంతరంగంలో పాడుకుంటూ తప్ప కీర్తనలు వ్రాయటం సాధ్యం కాదండీ - కనీసం నాకు. ఐతే నేను పాటగాడిని కాను కాబట్టి వీటి శ్రవ్యరూపంలో అందించలేను. అందుకు నన్ను మన్నించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి. ఒక రాగంలోఒక తాళంలో, వ్రాసేటప్పుడు నేను బాణీ కట్టుకొన్నా అది పాడే వారు అంతకంటే అందమైన మరిక బాణీని సమకూర్చుకోవటం సాధ్యమే. అంత కష్ఠం కూడా కాదు. ఇవన్నీ రాముడికి నివేదనగా అర్పించుకొంటున్నవి కాబట్టి ఈ కీర్తనల పట్ల నాకు కర్తృత్వభావం కూడా లేదు. ప్రజల సాక్షిగా నివేదిస్తున్నవి కాబట్టి ప్రజలలో ఎవరైనా పాడుకొందుకు అభ్యంతరం ఎందుకుంటుంది - ఉండదు.

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.