21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

తెలుగువారం ఏం చేయ గలమో ఇప్పుడు!


ఈ రోజున ఒక మంచి బ్లాగు వ్యాసం చదివాను .  తెలుగుజాతి: మనం ఏం చేయగలమో చిన్న వివరణ
దానిపై నా అభిప్రాయాలు ఈ‌క్రింద వ్రాస్తున్నాను. ఇవన్నీ ఒక వ్యాఖ్యద్వారా అక్కడ వ్రాయలేను కాబట్టి.

గాడిలో పడటానికి ఎంతో సమయం పట్టదు:   చాలా సమయమే పడుతుంది నిజానికి. అప్పులన్నీ సీమాంద్రకే ఉదారంగా సంక్రమింపజేసారు.  శూన్యం నుండి స్వర్గం క్షణాల్లో సృష్టించటానికి ఇదేమీ ఇంద్రజాలరంగస్థలం కాదు.  వాస్తవప్రపంచం.


కోస్తా ఆంధ్రా మొత్తం  దిగువ ప్రాంతంలో ఉంది.. అందువల్ల వచ్చే జల వనరుల నాపటం ఎవరి తరం కాదు:  పైవారి దయ తప్పదు. ఎగువను కల డాముల్లో జలసంపద పొంగిపొర్లాకే  సీమాంధ్రకి గుక్కెడు నీళ్ళు. ఈ‌ శతాబ్దమే ప్రపంచప్రజలు జలవనరుల కొరకు తన్నుకుచచ్చే శతాబ్ది అని శాస్త్రజ్ఞులు ఇప్పటికే హెచ్చరికలు ఇచ్చారు. ప్రతి సంవత్సరము ఋతుపవనాలు ఇబ్బడిముబ్బగా కరుణిస్తేనె మనకి లాభం. లేదా కరువుకాటకాలే.


తెలంగాణాలో భూస్వామిక, నైజాం ప్రభువుల నిరంకుశత్వం వల్ల హిందువుల/సామాన్య మానవుల ప్రగతి చాలా మందగించింది:  ఆ ప్రభువుల్నే నాలుకపీకేదాకా పొగడి పొగడి తరించారు తెలంగాణా ఉద్యమ కర్తలూ నాయకులూ‌ ముక్తకంఠంతో. నాయకుల బోధలు తలకెక్కిన తెలగాణావారు , తెలంగాణాలో ప్రగతి కుంబడటానికి మీరు చెప్పిన కారణం ఒప్పుకోరు కద? గతం‌గతః అనటం సులువు . కానీ, తెలంగాణాలో వచ్చే ప్రతి సమస్యకీ  సీమాంధ్రులు నిందలు మోయటం మరికొన్ని దశాబ్దులు తప్పదు.


ఆంధ్రా పారిశ్రామిక వేత్తలను అహ్వానించి పరిశ్రమలను నెలకొల్పటంలో తప్పు లేదు:  ఈ‌ మాటలను కొత్తగా తెలంగాణావాదులూ  వల్లెవేయటం మొదలెట్టారు. సీమాంధ్రలో పుట్టినవారంతా తెలంగాణాద్రోహులే అన్న సూత్రీకరణ అలా ఉంచి, నిజంగా వారిని వీరు నిజంగా పిలవగలరా, వారు నిస్సిగ్గుగా రాగలరా అన్నది ప్రశ్నార్థకం. సీమాంధ్రవారి మొదటి కర్తవ్యం అట్టడుగు నుండి తమ ప్రాంతాన్ని పునర్నింర్మించుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉద్యోగులకు జీతాలిచ్చేందుకూ‌ డబ్బులేని పరిస్థితి.  వారిలో డబ్బున్నవారి తాలూకు పరిశ్రమలూ పెట్టుబడులూ ఇప్పటికే తెలంగాణాలో ఉన్నాయి . అంతే కాదు అలా ఉండటం అనేది తెలంగాణా ఇన్నాళ్ళూగా దోచుకోబడటానికి కారణం అన్న సిధ్ధాంతమూ రాష్ట్రవిభజనకు కారణం. ఇప్పుడు తెలంగాణావారు సీమాంధ్రపెట్టుబడిదారులను ఆహ్వానించటం వారు లాభపడటం కోసం.  ఇంకా సీమాంధ్రపెట్టుబడిదారులు తమ సిరులు తెలంగాణాలోని హైదరాబాదు తదితర ప్రాంతాల అభివృధ్ధికే ధారపోసి సీమాంధ్రకు అన్యాయం చేయాలని కాంక్షించటం వాంఛనీయం కానేకాదు.


సౌర విద్యుత్ ను ప్రోత్సహించ గలిగితే కరెంటు కష్టాలు తీరుతాయి: ఈ‌ మాట చాలా నిజం.  ఉభయతెలుగుప్రాంతాల వారే కాక సమస్త భారతదేశమూ ఈ కోణంలో‌ చాల కృషి చేయాలి.


మధ్య తరగతి మామూలు ఉద్యోగికే ఇన్ని ఆలోచనలుంటే మన కలెక్టర్లకు, అధికారులకు ఎన్ని ఆలోచనలుండాలి:  తప్పకుండా మరింత ప్రణాళికా బధ్ధంగా సాంకేతికంగా సమున్నతంగా అలోచించగలిగి ఉండాలి వారన్నది నిస్సందేహం.  కాని గమనించండి. మనదేశంలో అందరు బ్యూరోక్రాట్లకు ఉన్నది ఒకటే డ్యూటీ - రాజకీయ నాయకులకు తందానా అనటం. అలా అనని వారికి నూకల్లేవు.  ఇంకా వారు నిర్మాణాత్మమైన ఆలోచనలు చేయగలిగేది ఎలా. ఒకవేళ అటువంటి ఆలోచనలు చేసినా అవి బయటపెట్టే సాహసం చేయటం ఎలా?