21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

ఒకచోట .. వేరొకచోట....

పరమానందం ఒకచోట
పరమవిషాదం ఒకచోట

గర్వోన్మత్తత ఒకచోట
నిర్వేదం వే రొకచోట

వేకువ విరియుట ఒకచోట
చీకటి ముసురుట ఒకచోట
 
ఆహా ఓహో‌ లొకచోట
హాహాకారా లొకచోట

రాగాలాపన లొకచోట
మూగరోదన లొకచోట

పన్నీటిధార లొకచోట
కన్నీటివాన లొకచోట

మక్కువ తీరుట యొకచోట
దిక్కులు కూలుట యొకచోట

కాలము వలచుట యొకచోట
కాలము కఱచుట యొకచోట

అన్నీ దక్కుట యొకచోట
అన్నీ‌ పోవుట యొకచోట

కాలచక్రము తిరుగుచుండగా
మేలు కీడులు చేయుచుండగా

ఆకులు కొన్ని పైకి చేరును
ఆకులు కొన్ని క్రిందికి జారును

ఏ చేతికిని చిక్కని కాలము నిజముగ పెద్దజాణ
నీచైర్గచ్ఛ త్యుపరి చ సదా చక్రనేమిక్రమేణ

గఛ్ఛతి గఛ్ఛతి గఛ్ఛతి  కాలం చక్రనేమిక్రమేణ
గఛ్ఛతి గఛ్ఛతి గఛ్ఛతి  కాలం చక్రనేమిక్రమేణ