18, ఫిబ్రవరి 2014, మంగళవారం

ఇది శోకము, ఒక నాటికి ఇది తీరును ... ఇది తీరును ...




 
ఇది శోకము ఒక నాటికి ఇది తీరును ఇది తీరును
ఇది లోకము ఒకనాటికి ఇది మారును ఇది మారును

ఈ కాలము అది చేయదు ఇదిచేయదు అని ఉండదు
ఏ కొంచెమొ అది నీదని  ఇది నీదని  విధి యెంచదు
నీ‌ కష్టము నీ‌ నష్టము అవి మాత్రమే నీ స్వంతము
పై కొన్నది విధియన్నది నీ ధైర్యమే నీ పెన్నిధి

తనవారలే వడ్డించుచో తానెక్కడ కూర్చుండిన
తన విస్తరి మరి నిండదా?
తనవారలే  పెరవారలై తన మోము చూడక యుండిన
తన గొంతు  తప్పక ఎండదా?
కనికారము విధిచూపక కడపంక్తిలో నీ వుండిన
నిను జూచి లోకము నవ్వదా?
అణగార్చినా ఆ కాలమే ఆ ఈశ్వరకృప యుండిన
అనుకూలమై  నీ కుండదా?

పవలును రేలును వచ్చి పోయెడు భంగిని సుఖములు కష్టములు
భువిపై మనుజుల పలుకరించుచు పోవు టెఱింగుదు రుత్తములు
ఎవరికి తెలియును  ఈ‌నాడైనది ఎవరికి  ఎంతటి మేలగునో
ఎవరికి తెలియును రేపేమగునో ఎవరికి ఎప్పుడు మేలగునో

 


12 కామెంట్‌లు:

  1. ఒకనాటికి ఇది తీరును.... అన్న ఆశాభావం మంచిదేనేమో కానీ... ఇది తీరని శోకం. మరణం తర్వాత ఇంక బతికివచ్చే అవకాశాలు లేవనడం నిరాశావాదమనిపించినా అదే నిజం. ఈనాడైనది ఎవరికీ... ఇద్దరిలో కనీసం ఒకరికి... ఎంతటి మేలూ కాలేదు. ఎప్పటికీ కాలేదు. సామాన్యుడి బతుకు సర్వనాశనం అవడం తప్ప ఇంకేమీ జరగబోదు.

    మీ ఆశావాద దృక్పథమే నిజమై ఇరువురికీ మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ....

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. Am I mourning?
      perhaps you understood the work according to your mindset. Nothing wrong though. If you have patience give it some more reading. Thanks.

      తొలగించండి
    2. అయ్యా గొట్టిముక్కలవారూ, నా కవితలో ఆశావహదృక్పధమే ఉందికాని శోకవిహ్వలతలేదు. అదీకాక నేను శోకిస్తున్నానని చెప్పనే లేదే. ప్రజలో శోకభావన ఉంది, దానిని సంబోధించి వ్రాసాను. మరికొంత విషయమూ ఉందికాని ఆవేశకావేశాల్లో ఉండి మీరు దానిని గమనించలేదు. కేవలం నేనేదో పెద్దపెట్టున రోదిస్తూ నా కడుపుమంటను చల్లార్చుకుందుకే ఇలా వ్రాసానని మీరు అనుకుంటున్నారు. ఇంకా మీకు అపోహలు ఉంటే ఒక దండం! ఇంకేమీ వివరించ దలచుకోలేదు. నా యీ చిన్న కవిత్వానికీ నేనే స్వయంగ టీకా టిప్పణీ వ్రాసుకోవాలా ఖర్మకాకపోతే! "అరసికాయ కవిత్వ నివేదనం శిరసి మాలిఖ మాలిఖ మాలిఖ" అని మొత్తుకున్న కవి మాటే నాదీ ఇక. స్వస్తి.

      తొలగించండి
  3. ”పోయింది పొలవకట్టు, ఉన్నది ఉలవకట్టు""

    రిప్లయితొలగించండి
  4. నేడు విజయంగా కనిపించేది ముందు ముందు పరాజయంగా పరిణమించవచ్చు. నేటి పరాజయ పరాభవం రేపటి విజయానికి తొలి అడుగు కావచ్చు. మొక్కవోని కృషి, ఆపైన ఈశ్వర కృప ఉంటే ఉజ్వల భవిత ఖాయం. ఎంతైనా విడిపోయినది మన సోదరులే. తెలంగాణా సోదరులకు శుభాకాంక్షలు. రాజకీయ నాయకులతో తస్మాత్ జాగ్రత్త.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అలా నిస్వార్థంగా ఇరువంకల ప్రజలూ నాయకులూ అనుకోవాలని ఆశిద్దాం.

      తొలగించండి
  5. భారత దేశంలోని ప్రజలందరూ వర్ధిల్లాలి. మనమందరం భారతీయులం అన్న సత్యాన్ని అందరూ గుర్తించాలి. భాషలు, రాష్ట్రాలు, జాతులు, వర్గాలు లాంటివన్నీ దేశం ముందు తృణప్రాయం.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.