22, ఫిబ్రవరి 2014, శనివారం

ఇంతకీ ఎవరేం సాధించారండీ?

ఏదో పెద్ద తుఫాన్ వెలిసినట్లుంది రాజకీయ వాతావరణం.

ఇన్నాళ్ళుగా అహహ సరిగాదు ఇన్నేళ్ళుగా నడిచిన రాజకీయ రగడ తరువాత ఎవరేం సాధించారో అన్న విశ్లేషణ చేసుకుని చూసుకోవలసిన అవసరం ఉంది.

నిజానికి ఆ అవసరం రాజకీయ నాయకులకూ పార్టీలకూ చాలా ముఖ్యమైనది.  సార్వత్రిక ఎన్నికలూ వాటితోబాటుగా రాష్ట్రస్థాయి ఎన్నికలూ చాలా దగ్గరలో ఉన్న ఈ సమయంలో రాజకీయవర్గాలు ఈ విషయంలో ఒక అవగాహనకు రావలసి ఉంది.  వాటి తరపున మనం‌ కష్టపడవలసిన అవసరం‌ ఈషణ్మాత్రమూ లేదు.   కాని, వాటి జీవన్మరణాలకు కారణమైన ఓట్లను అచ్చుగుద్దే ప్రజలం మనమే. కాబట్టి ప్రజలకు సరైన అవగాహన అన్నది ఓట్ల పండుగ సమయమయ్యేది కాకపోయేది చాలా అవసరం‌ కాబట్టి ఈ విశ్లేషణ అనేది మనకు అత్యంత ముఖ్యమైనది కూడా.

ఐతే, ఈ విషయంలో సంపూర్ణమైన పరిజ్ఞానంతో‌ నేను వ్రాయగలగటం అనుమానాస్పదమే.  నేను రాజకీయ విశ్లేషణల విషయంలో కాకలు తీరినవాడిని కాను.  కాని నా బ్లాగులో నా అభిప్రాయాలు గుదిగుచ్చుకుంటే దానిలో ఎవరికీ అభ్యంతరం కనిపించదనే భావిస్తున్నాను.

ఒక్కొక్క రాజకీయపార్టీనీ తీసుకుని దాని పరిస్థితి ఏమిటో చూద్దాం.  ఏ రాజకీయపార్టీ ఐనా ఏ సమయంలో ఏమి చేసినా ఏమి చేయకపోయినా దాని వెనుక రెండే రెండు కారణాలుంటాయి.  మొదటిది తన పార్టీ పరిస్థితిని సంరక్షించుకోవటం లేదా పదిలపరచుకోవటం‌ లేదా మెఱుగుపరచుకోవటం.  రెండవది తనకు ఇబ్బంది కలగని విషయాలలో అనవసరంగా కల్పించుకోకపోవటం.

ప్రత్యేకతెలంగాణా ఉద్యమం ఈ‌ నాటిది కాదు.  ఆంధ్రప్రదేశరాష్ట్రావతరణం సమయానికే తెలంగాణా ప్రాంతాన్ని ఆంధ్రరాష్ట్రంలో కలపాలా విడిగా ఉంచాలా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి.  ఈ‌ వ్యాసం ఉద్దేశం ప్రత్యేకతెలంగాణా ఉద్యమం గురించి చర్చించటం కాదు కాబట్టి ఆ విషయం‌ మీద చర్చ చేయటం లేదు ఇక్కడ.  కాని ఉద్యమం పందొమ్మిదివందల అరవై తొమ్మిదిలో ఉవ్వెత్తున పైకెగసింది.  మరలా ముఫై రెండు సంవత్సరాల తరువాత ఉపొంగింది. మధ్యకాలంలో నిద్రాణంగా ఉండటం విశేషం.  అలా ఎందుకు జరిగిందీ అన్నది ఇక్కడ చర్చనీయాంశం కాదు కాబట్టి వదిలేద్దాం. ఇదిగో ఈ నాటికి తెలంగాణారాష్ట్రం ఏర్పడబోతున్నది. ప్రజలకే కాక అన్ని రాజకీయపార్టీలకూ ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాలూ వాటిలో తమ తమ ఉనికీ అన్నది కొత్తగా చర్చనీయాంశం అయ్యింది.

కాంగ్రెసుపార్టీ విషయం మొదట చూద్దాం.  కాంగ్రెసువారు 2004నుండి ఈ విషయంలో చురుగ్గా ఉన్నారు.  తెలంగాణాకు ప్రత్యేకరాష్ట్రం ఇస్తామని వాగ్దానం కూడా చేసారు.  కాని వారు ఆ విషయంలో నానా కంగాళీగాను ప్రవర్తించారు. తమ వాగ్దానాన్ని నెఱవేర్చుకుందుకు ఏ మాత్రం చిత్తశుధ్ధినీ ప్రదర్శించలేదు. అసహ్యం కలిగించే స్థాయిలో‌ నాటకాలాడి తెలంగాణా రాష్ట్రం కోసం ఆశలు పెట్టుకున్న అనేకమందికి తమ ఊగిసలాట ధోరణితో నిరాశానిస్పృహలు కలిగించారు. రకరకాల సాకులు చెబుతూ కాలక్షేపం చేస్తూ పరిస్థితిని బాగా కలగాపులగం చేసారు. రెండు సార్వత్రిక ఎన్నికలలో చేసిన వాగ్దానాన్ని మూడో సార్వత్రిక ఎన్నిక కాస్తా ముక్కుదాకా వచ్చిన సమయంలో హమ్మయ్యా నెఱవేర్చాం అనిపించుకున్నారు. నిజానికి 2009నుండీ ఈ విషయంలో వారు వేసిన కప్పగంతులన్నీ ఈ‌ 2014లో ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతోనే వాయిదాలు వేసే కుట్ర అనే అనుకోవలసి వస్తుంది.   ఐతే వారి పాచిక పారినట్లేనా అన్నది ఆలోచనీయం.  తెలంగాణా ఇచ్చినందుకూ, రాష్ట్రవిభజనలో నిరంకుశంగా వ్యవహరించినందుకూ సీమాంధ్రుల ఆగ్రహం కారణంగా అవశేషాంధ్రప్రదేశం ఎన్నికల్లో నేరుగా గెలిచే పరిస్థితి లేదు.  తెలంగాణాలో కేసీఆర్‌ను ప్రక్కకు తప్పించి గెలిచే పరిస్థితి కూడా ఉండదు. ప్రస్తుతం వారి ఆలోచనాధోరణి జగన్మోహనరెడ్డిని ఎన్నికల అనంతరమూ, కేసీఆర్‌గారిని ఎన్నికల సమయంలో ముందుగానో వెనుకనో అస్మదీయుల్ని చేసుకుని అంతిమంగా ఆంధ్రదేశం తమ గుప్పెటనుండి జారిపోలేదని నిరూపించుకోవా లన్నది.  ఈ విషయంలో వారికి కొంత స్పష్టత ఉన్నదనే భావించాలి. 

తెలుగుదేశం పార్టీ గురించి.  స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి అనుపమానమైన కీర్తిప్రతిష్టల కారణంగా ఏర్పడిన ఆ పార్టీ 2004లో అనూహ్యంగా కాంగ్రెసువారి చేతిలో ఓడినప్పటినుండి క్రమంగా బలహీనపడుతూ వస్తున్నది. హైటెక్ బాబుగారు హైదరాబాదుకు ఎంతో చేసారు. అది కాదన లేని సత్యం.  అదే బాబుగారు మిగతా ఆంధ్రదేశంలోని ఏ పట్టణం అభివృధ్ధినీ పట్టించుకోలేదు. అదీ కాదన లేని సత్యమే. హైటెక్ సిటీ తయారవక ముందటి హైదరాబాదుకూ ఇప్పటి సిటీకీ హస్తిమశకాంతర బేధం ఉంది.  హైదరాబాదుకు హైటెక్ హంగులద్ది దానిని డబ్బులు సంపాదించి పెట్టే కామధేనువుగా మార్చినందుకు బాబుగారిమీద జనానికి మంచి అభిమానమే ఉంది.  2009లో కూడా చిరంజీవి గారు ఒక పార్టీ పెట్టి ఒక నాటకీయమైన సైంధవపాత్ర పోషించి ఉండకపోతే ఆయనగారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేదన్నది సత్యం.  కాని ఈ రోజున పరిస్థితులు మారాయి.  తన పార్టీని తెలంగణాలో సజీవంగా ఉంచటానికి గాను ఆయన బహుశః అయిష్టంగానే తెలంగాణా ఏర్పాటుకు తెలుగుదేశం అనుకూలమే నని డిక్లరేషన్ ఇచ్చేసాడు 2008లో.  ఇప్పుడు తెలంగాణాకాస్తా ముంగిట్లోకి రాగానే సమన్యాయం అంటూ నొక్కి వక్కాణిస్తూ తెలంగాణాలో ఉన్న ఇమేజ్‌ని పోగొట్టుకున్నాడు. ఇటు సీమాంధ్రులూ చంద్రబాబు ఇచ్చిన లేఖవల్ల కొంపలు ములిగాయని భావించటంలో అటూ చెడింది తెలుగుదేశం.  ఇప్పుడు దాదాపు రెంటికీ చెడిన రేవడి చందం అన్నమాట.  బీజేపీ వారు ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేలా ఉన్నారు కాబట్టి వారిని దువ్వుతూ వారి సాయంతో మరలా పునర్వైభవం దిశగా ఆడుగులు వేసింది తెలుగుదేశం.  కాని బీజేపీ వారికి సీమాంధ్రలో ఓట్లు రాలే అవకాశాలు బాగా తక్కువ. ఈ‌ మధ్యన విభజనఘట్టంలో వారు పోషించిన హాస్యపాత్రతో సీమాంధ్రజనానిని బీజేపీ పట్ల ఏహ్యభావం కలిగింది.  కాంగ్రెసువారు సీమాంధ్రలో దెబ్బతిన్న మాట వాస్తవమే కాని తద్వారా ఏర్పడ్డలోటును జగన్ పార్టీ ఎగరేసుకు పోతోందన్న విషయం తెలుగుదేశానికి చెమట్లు పట్టిస్తున్నాయి. ఇటుతిరిగి జై తెలంగాణా అనలేక,  తెగించి అటుతిరిగి జై సమైక్యాంధ్రా అనలేక ఎదేదో నసిగి నసిగి చంద్రబాబుగారు జనానికి బాగా విసుగు తెప్పించారు.  ఇప్పుడు రెండురాష్ట్రాల్లోనూ‌ ఉనికి చాటుకుని అధికారమూ తెచ్చుకుని జాతీయపార్టీగా తెలుగుదేశం వస్తుందని వారు బడాయి కబుర్లు చెబుతున్నారు. జనానికి  మాత్రం  ఏమాత్రం నమ్మకమూ కలగటం లేదు.  ఆయన తెగించి కేంద్రంతో సీమాంధ్రకోసం పోరాడటానికి సిధ్ధంగా ఉన్నారా జగన్ లాగా?  తెలంగాణా కోసం పనిచేయటానికి సిధ్ధంగా ఉన్నారా కెసీఆర్ కన్న మిన్నగా? రెండూ‌ అబధ్దాలే కదా? మరి తెలుగుదేశానికి ఎవరు ఓటు వేస్తారు?

తెలంగాణారాస్ట్రసమితి గురించి.   2001లో అనుకుంటాను, చంద్రబాబుగారు తనమంత్రివర్గం నుండి కేసీఆర్‌గారిని తప్పించినది.  (అప్పటి నుండి తెలుగుదేశం పార్టీ తిరోగమన దిశగా ప్రయాణిస్తున్నది!)  చంద్రబాబును దెబ్బకొట్టే ప్రతివ్యూహంగా కేసీఆర్‌గారు ప్రత్యేకతెలంగాణా ఉద్యమాన్ని తవ్వి తలకెత్తు కున్నారు. నాకు గుర్తున్నంతవరకూ స్వర్గీయ చెన్నారెడ్డిగారు శ్రీమతి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో ఉక్కుగనుల శాఖామంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్దిరోజులకే ఆయన ప్రత్యర్థి వందేమాతరం రామచంద్రరావు గారి తరపున సుప్రీంకోర్టు చెన్నారెడ్డిగారి ఎన్నికను రద్దుచేసింది.  రాజకీయనాయకుడు నిరుద్యోగి ఐతే ఎంతప్రమాదమో అన్నది ఆయన తెలంగాణాప్రజాసమితిని ఏర్పాటు చేసి ప్రత్యేకతెలంగాణా ఉద్యమాన్ని ఎత్తిపట్టుకోవటంతో తెల్లమైంది. దాదాపు అలాగే చంద్రశేఖరరావుగారు కూడా చంద్రబాబుగారి దగ్గర నౌకరీ పోయేసరికి తెలంగాణా ఉద్యమాన్ని బుజానికెత్తుకుని దాన్నే తన భవిష్యత్తుగా మార్చుకున్నారు.  ఆయన నిరంతరపోరాటం చేయటం ఫలితంగానే నేడు తెలంగాణారాష్ట్రం సాకారమైంది.  రాష్ట్రసాధనా క్రమంలో చంద్రశేఖరరావుగారు తన ఉద్యమపార్టీ తెరాసను కాంగ్రెసులో విలీనం చేస్తాననీ ఎఱచూపారు సోనియా & కం. వారికి.  గత జూలై నెలలో ఎట్టకేలకు తెరాసవారు కలలు కంటున్న తెలంగాణారాష్ట్రం ఇవ్వటానికి కాంగ్రెసుపార్టీ నిర్ణయించిందని ప్రకటన చేసిన శ్రీదిగ్విజయ సింగ్, అదే వాక్యం చివరన ఇంక తెరాసవారు మాతో విలీనం అవుతున్నారని ఆశిస్తున్నాను అని కూడా పూర్తిగా నిస్సిగ్గుగా చెప్పేసారు.  సరే, రాష్ట్రం వచ్చిన శుభసందర్భంలొ తెరాసవారిమీద కాంగ్రెసువారు విలీనం కోసం గణనీయమైన వత్తిడి తెస్తారు, తెస్తున్నారు కూడా.  కాని విజ్ఞత దండిగా కల చంద్రశేఖరరావు గారు కాంగ్రెసుమహాసముద్రంలో తెరాసను విలీనం చేసి దాన్ని కాస్తా ఏటిలో పిసికిన చింతపండు చేస్తారా అన్నది ప్రశ్న.  ఇల్లలకగానే పండుగ కాదు కదా? ఇంకా కాంగ్రెసువారి నుండి కొత్త తెలంగాణా రాష్ట్రప్రయోజనాలదృష్ట్యా మరికొంతకాలం విడిగా ఉండి అవసరమైనప్పుడల్లా డిమాండ్లు చేయగల అవకాశాన్ని ఆయన వదులు కుంటే ఎలా? తెలంగాణాగడ్డ మీద ఎంత సోనియమ్మమీద అభిమానం పొంగిపొరలుతున్నా కేసీఆర్‌గారి అభ్యర్థులకే విజయావకాశాలు మెండు.  ముప్పుతిప్పలు పెట్టికాని కాంగ్రెసుపార్టీవారు తెలంగాణాను ఇవ్వలేదన్న సంగతి దాస్తే దాగే విషయం కాదు కదా? అందుచేత జనం మొగ్గు సహజంగానే చంద్రశ్రేఖరరావుగారి వైపే ఉంటుంది.  అది ఆయనకూ బాగా తెలుసు. కాబట్టి విలీనం విషయంలో ఆయనేం చేస్తారో చూడాలి.

భారతీయజనతాపార్టీ అనేది ఒక జాతీయపార్టీ.  ఆ విషయం ప్రతిరోజూ ఏదో‌ఒక సందర్భంగా యావద్దేశానికీ ఆపార్టీ నాయకులు గుర్తుచేస్తూ ఉపన్యసిస్తారు.  ఈ మధ్య మోడీగారు యావద్దేశంలోనూ ప్రజాదరణగల నాయకుడిగా ఎదిగి నిలబడటంతో బీజేపీ వారి ఆత్మవిశ్వాసం ఒకింత దుష్టగర్వం స్థాయిలో కనిపిస్తోంది. ఈ బీజేపీ వారు ఎప్పటినుండో దేశంలో చిన్నరాష్ట్రాల ఏర్పాటుకు తమ సంపూర్ణమైన మద్దతుని ప్రకటించారు. తెలంగాణాకు అనుకూలమని  - చంద్రబాబుగారి లాగా నాలుక మడతవేసుకుని కాక - విస్పష్టంగా ప్రకటించేసారు.  అందుచేత సీమాంధ్రప్రజలు బీజేపీ వారు తమ ప్రియతమ ఆంద్రప్రదేశరాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటానికి బీజేపీవారు  కలిసివస్తారని ఎన్నడూ ఆశించలేదు. సీమాంధ్రప్రయోజనాల్ని పరిరక్షించే కార్యక్రమం కూడా బీజేపీవారు నెత్తినేసుకుంటారని అనుకోలేదు.  అటువంటి మాటలు బీజేపీ వారు పలకటమే కాదు, సీమాంధ్రప్రయోజనాల కోసం పట్టుపట్టటం కూడా చూసి సీమాంధ్రులు ఎంతో సంతోషించి ఆశలు పెంచుకున్నారు.  ఐతే బీజేపీవారు సీమాంధ్రవారి ప్రయోజనాల పరిరక్షణ అంశం గురించి బోలెడు హంగామా చేసి చివరకు దాన్ని పూర్తిగా అపహాస్యం పాలు చేసారు. తెరాసావారే తయారు చేసి కాంగ్రెసు గ్రూప్ ఆఫ్ మోరాన్స్ చేతిలో పెట్టి చట్టసభలకు తెచ్చినట్లు అపఖ్యాతి మూటగట్టుకున్న ఆ  విభజనబిల్లుని చల్లగా అమోదించేసారు. కురుసభలో శకుని పాత్ర వంటి దుష్టపాత్రలో శ్రీమాన్ వెంకయ్యనాయుడుగారు పూర్తిగా లీనమై పోయి నటించేసారు.  ఇప్పుడు కాంగ్రెసువారే కాదు, బీజేపీవారూ సీమాంధ్రవారి దృష్టిలో కచ్చితంగా శత్రువులే.  బీజేపీకి సీమాంధ్రలో ఎప్పుడూ పట్టులేదు.  ఇప్పుడు విరోధం కూడా పెట్టుకున్నారు. అటు తెలంగాణా మీద బంధుప్రేమ కూడా ఒలకపోసి సుష్మాస్వరాజ్‌గారిని తెలంగాణాకు చిన్నమ్మను చేసినా, తెరాస-కాంగ్రెసు-బీజేపీల మధ్య తెలంగాణాలో జరిగే ఎన్నికలపోరులో హీనపక్షం బీజేపీనే అన్నది నిస్సందేహంగా.  మరో పార్టీ తెలుగుదేశం కూడా తెలంగాణాలో పోటీకి దిగుతుంది కాని దానికి పెద్దగా పోటీ ఇచ్చేంతగా ఓట్లు రాలవనే అనుకోవాలి.  చివరికి విభజనబిల్లు సందర్భంగా  బీజేపీవారు చేసిన హడావుడి వాళ్ళను హాస్యగాళ్ళ స్థాయికి దించింది కాని తెలుగునాట ఓట్లకు నోచుకునేందుకు ఏమీ సాయపడ లేదు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ.  ఇది ఒక పిల్లకాంగ్రెసు పార్టీ.  కాదని ఆవేశపడిపోయేవాళ్ళు ఎందరున్నా ఔనని అనుమానించే వాళ్ళు దేశవ్యాప్తంగా అంతకన్న ఎక్కువే.  సీబీఐవారి సహాయంతో సోనీయమ్మగారు అబ్బాయిగార్ని బాగానే దారికి తెచ్చుకున్నారని అనేకులు నమ్ముతున్నారు. ఆర్టికిల్ ౩ సహాయంతో ఆంధ్రప్రదేశ్ విభజన నల్లేరుపై నడక అని పెద్దమ్మగారికి సలహా ఇచ్చిన ఈ పార్టీ తమ స్టాండు మార్చుకుంది.  కారణాలు స్పష్టమే.  ఎంత చేసినా కేసీఆర్‌గారిని దెబ్బకొట్టి తెలంగాణాను స్వాధీనం చేసుకోలేమన్న జ్ఞానోదయం ఒక వంకా, పట్టున్న సీమాంధ్రలో విరోధం పెట్టుకోరాదన్న వివేకోదయం ఒకవంకా జగన్మోహనులను మడమతిప్పేలా చేసాయి.  వీరావేశంతో జగన్ సమైక్యాంధ్రకూ జై అంటూ ఎంత హడావుడిచేసినా, జనం పూర్తిగా ఆయన నిబధ్ధతను నమ్మారని చెప్పలేము.  ఐనా కోస్తాంధ్రలో జగన్ పార్టీకి మంచి పట్టే ఉంది - సాంప్రదాయిక కాంగ్రెసువర్గాల తరపునుండి.  జగన్ - సోనియా పార్టీల మధ్య దేన్ని ఎంచుకోవాలా అన్న మీమాంసలో ఉన్నవారికి నిన్నటి రాష్ట్రవిభజన శంకతీర్చింది.  మన న్యాయవ్యవస్థ గొప్పది.  పది రూపాయల దొంగకు బెయిల్ దొరికే అవకాశం చేతికి రాకుండా అనేకానేక చట్టాలు అడ్డువస్తాయి.  కొన్ని వేల కోట్ల మేర ఆర్థిక నేరారోపణల్లో చిక్కుకున్నవారికి వారు కాస్తా రాజకీయ నాయకులైతే అన్ని ద్వారాలూ ఎప్పుడూ‌ బార్లా  తెరచి ఉండేందుకు న్యాయచట్టాలు ఏమీ అడ్డుపడవు.  అందుచేత ఎంత సందేహాస్పదమైన గతం ఉన్నా అది జగన్మోహనుడు ముఖ్యమంత్రి కావటానికి అడ్డు రావు.  ఓట్లు వేయటానికి జనానికి అభ్యంతరం లేకపోతే ఆయన సీమాంధ్రకు ముఖ్యమంత్రి అయ్యేందుకు ఏమీ ఇబ్బంది ఉండకపోవచ్చును.

నల్లారివారి రాబోయే పార్టీ:  అదింకా నల్లారి వారి ఊహలోనే ఉంది.  అయన గారు అంత సాహసం చేస్తారనుకోను.  ఒకవేళ ఆయన పార్టీ పెట్టినా, ఇంత రగడ చేస్తూ కూడా సోనియాపై  ఈగవాలటానికి వీలులేదన్నట్లు విస్పష్టంగా మాట్లాడిన ఈయనగారు రేపు గెలిచి తన మందీ మార్బలంతో సహా సోనియాకూ జై అంటూ మాతృసంస్థలో విలీనం కాడని ఎవ్వరూ నమ్మరు. ఈ సంగతి గ్రహించే విజ్ఞత ఉన్న ప్రజలు తనకు పెద్దగా ఓట్లు వేయరని ఆయన ఒక కొత్త పార్టీ పెట్టటానికి జంకుతున్నట్లుంది.  కానీ, జగన్ గారి ఓట్లో, బాబుగారి ఓట్లో చీల్చటానికి సోనియమ్మ ఈ‌ నల్లారివారిచేత ఒక పార్టీ పెట్టించుకునే అవకాశాలూ దండిగానే ఉన్నాయి.  వేచిచూడాలి.

చిల్లరపార్టీలు: అంటే కమ్యూనిష్టులూ, లోక్‌సత్తా వగైరాలన్నమాట. బాలెట్ పేపర్లలో అభ్యర్థుల సంఖ్యపెంచటం మించి వీళ్ళు ఊడబొడిచేది ఏమీ లేదు.  అందుచేత వీళ్ళ గురించి చెప్పేందు కేముంటుంది? అక్కడక్కడా ఒకటి రెండు సీట్లు వీళ్ళకు వచ్చినా మిగతా పార్టీలు వీళ్ళ చక్రాల్ని కొనుగోలు చేస్తాయి కాబట్టి ఒరిగేదేమీ ఉండదు.

8 కామెంట్‌లు:

  1. భా జ పా వాళ్ళు సాధించారండి...

    యావత్ సీమాంధ్రా ప్రజల చీత్కారాలు,
    చివాట్లు, చెప్పు దెబ్బలు...

    కాంగ్రెస్ బహు జిత్తులమారిదండి...
    ఒక్క దెబ్బకు రెండు పిట్టలు...
    తెలంగాణా పై బిల్లు ద్వారా పూర్తి పట్టు...
    సీమాంధ్రాలో భా జ పా దరి చేరబోయిన
    ప్రజానీకంతో తెలివిగా ఛీ కొట్టించడం...
    అది తెలుసుకోలేని దద్దమ్మగా భా జ పా
    దేశ చిత్రపటం మీద ఆవిష్కృతం కావడం...

    రిప్లయితొలగించండి
  2. ఎవరేం సాధించారంటే .....
    తెలుగు ప్రజల నెత్తిన -
    రెండు ముఖ్య మంత్రి పదవులూ
    రెండు పీసీసీ ప్రెసిడెంటు పదవులూ
    రెండు మంత్రి వర్గాలూ ..... వగైరా వగైరా ....
    పదవులు పెరిగేయి కదా
    రాజకీయ పార్టీల నన్నింటినీ ఒక జాతిగా ఊహించండి
    ఇప్పుడొక పార్టీ పదవు లనుభవిస్తే -
    రేపింకొక పార్టీకి అవకాశం రావొచ్చు .
    అవకాశాలు రెట్టింపు కాలేదా మన నేతలకు .
    ----- సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  3. Good analysis. All parties started i.e jagan and another likely by nallari are only the camcas of congi, no dobt. BJP will either loose or gain in AP. It is not interested inAP as people r not interested in it.

    రిప్లయితొలగించండి
  4. "అదే బాబుగారు మిగతా ఆంధ్రదేశంలోని ఏ పట్టణం అభివృధ్ధినీ పట్టించుకోలేదు"

    2004లొ ఆయన ఓడిపోవడానికి ముఖ్య కారణాలు రెండని నా ఉద్దేశ్యం: 1. అన్ని ప్రాంతాలలో గ్రామాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం 2. 1999 కి మల్లె భాజపా వోట్లు లేకపోవడం

    "రాజకీయనాయకుడు నిరుద్యోగి ఐతే ఎంతప్రమాదమో అన్నది"

    మరి తొమ్మిది ఏళ్ళు నౌకరీ లేని బాబు గారికి ఇది వర్తించదా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాబుగారు పూర్తిగా నిరుద్యోగి కాలేదు కదా? చేతిలో ఒక పెద్దపార్టీకి అధినేత హోదా ఉన్నది. అదీకాక ఆయనకు ప్రతిపక్షనాయకుడి హోదా ఉన్నది. చేతినిండా పనీ ఉన్నది. చెన్నారెడ్డిగారు కాంగ్రెసులో అప్పట్లో ఇటూ రాష్ట్రం నుండి రాజకీయ పదవి ఎదీ లేని స్థితి, అటు కేంద్రంలో పదవి ఊడిన స్థితి. పార్టీలో మందిలో గోవిందయ్య. అందుచేత తన ఉనికినీ బలాన్నీ చాటుకోవలసిన ఆవసరం ఆయనకు ఏర్పడింది.
      అదటుంచండి. నేను రాజకీయవిశ్లేషకుడిగా కాకలుతీరిన వాడినీ‌కాను, ఆలా కావాలని ప్రయత్నించేవాడినీ‌ కాను. నేనేదో‌బాబుగారిని వెనుకవేసుకొని వస్తున్నానని ఆరోపించే ప్రయత్నం ఎందుకూ చేస్తున్నారు. రంధ్రాన్వేషణ చేయదలచుకుంటే, ఈ ఆర్టికిల్ పరమఅసమగ్రంగా ఉందని నాకు తెలియని కొత్తవిషయం ఏమీ మీరు చెప్పటం‌ లేదు. ఇంకా ఎత్తిపొడుపుల పర్వమేనా?

      తొలగించండి
    2. మిమ్మల్ని దేప్పిపొడవడం నా ఉద్దేశ్యం కాదని సవినయంగా మనవి.

      ఇకపోతే నా రెండో ప్రశ్న చంద్రబాబు గురించి కాదు. రాజకీయ నిరుద్యోగం అనే ఒక "అవకాశం" వినియోగించాలంటే ఆ వ్యక్తి ఉద్దేశ్యం & పటిమ సరిపోవు, అప్పటి పరిస్తితుల అనుకూలతే predominant driving force అని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.

      మీరు రాజకీయ విశ్లేషకులు కాదన్నా, టీవీ "చర్చ"లలో రోజూ కనిపించే "మేధావుల" కన్నా మీ టపా ఎంతో బాగుంది. I fully appreciate your analysis.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.