31, జనవరి 2013, గురువారం

ఆనందము నిను జూచుట


కం. ఆనందము నిను జూచుట
ఆనందము నీకు పూజ లర్పించుట బ్ర  
హ్మానందము నీ వానిగ
నేనుండుట నిన్ను కొలువ నేర్చుచు రామా


(వ్రాసిన తేదీ: 2013-1-16)

30, జనవరి 2013, బుధవారం

రవిచంద్రులు తారకలును


కం. రవిచంద్రులు తారకలును
భువియును స్వస్థితుల కోలుపోయెడు దాకన్
రవికులపతి శుభచరితం
బవలంబన మగుచు సజ్జనాళిని బ్రోచున్


(వ్రాసిన తేదీ: 2013-1-10)

29, జనవరి 2013, మంగళవారం

రాముని బోలు పుత్రుడును


ఉ. రాముని బోలు పుత్రుడును రాముని బోలెడు నట్టి మిత్రుడున్
రాముని బోలు భర్తయును రాముని బోలెడు నట్టి యన్నయున్
రాముని బోలు సత్ప్రభువు రాముని బోలెడు ధర్మమూర్తియున్
రాముని బోలు దైవమన రాముడె గాక మరొక్క డుండునే.



(వ్రాసిన తేదీ: 2013-1-10)


28, జనవరి 2013, సోమవారం

రాముడె రక్షకుండు


ఉ. రాముడె రక్షకుండు రఘురాముడె దుర్జన శిక్షకుండు శ్రీ
రాముడె  రోదసీజలధరానిలవహ్నుల నేలు వాడు సు
త్రామసరోరుహాసననిరంతర సేవ్యపదారవిందు డు
ద్దామతపఃఫలాకృతి సదా మునికోటికి రాముడే సుమా.



(తేదీ: 2013-1-10)

27, జనవరి 2013, ఆదివారం

రాముని భక్తవర్యులు


ఉ. రాముని భక్తవర్యులు నిరంతరమున్ వినుతింతు రాత్మలో
కాముని పైన ధ్యాస గల కాపురుషాళికి గల్గు దుర్గతుల్
ప్రేముడి మోక్ష మిచ్చు రఘువీరుడు కాముడు నారకం బిడున్
నా మత మందుచేత సుజనావళి మెచ్చగ రాము గొల్చుటే


( తేదీ: 2013-1-10)


26, జనవరి 2013, శనివారం

సత్యప్రతిజ్ఞ యిట్టులని


మ. సత్యప్రతిజ్ఞ యిట్టులని చక్కగ చాటెను రామచంద్రుడే
నిత్యము ధర్మవర్తనము నేర్పుగ చాటెను రామచంద్రుడే
స్తుత్యుడు నిత్యుడీశ్వరుడు చూడగ మా రఘురామచంద్రుడే
భృత్యుడ నందుచేత కడు ప్రేమమయుండగు రామమూర్తికిన్



(రచించిన తేదీ: 2012-12-31)



25, జనవరి 2013, శుక్రవారం

శ్రీకర శుభకర నామా


కం. శ్రీకర శుభకర నామా
భూకన్యారమణ సకలభూజన వినుతా
లోకారాధ్యారామా
సాకేతపురాధినాధ సద్గుణధామా



(రచించిన తేదీ:  2012-12-31)

24, జనవరి 2013, గురువారం

రాముని బోలు రాజొకడు


ఉ. రాముని బోలు రాజొకడు రాజ్యము చేసిన దేడ నుర్విపై
రాముని బోలు పుత్రుడు ధరాతల మందున నేడ బుట్టె మా
రాముని బోలు భర్తయన రాముని బోలెడు సోదరుండనన్
భూమిని పుట్టలేదు మరి పుట్టరు పుట్టరు పుట్టరెన్నడున్



(పద్యం రచించిన తేదీ: 2012-12-29)

23, జనవరి 2013, బుధవారం

రాముడు కాచు నా తలను


ఉ. రాముడు  కాచు నా తలను 
    రాముడు కాచు ధనంబు మానమున్
రాముడు కాచు  జీవనము

    రాముడు కాచు బలంబు తేజమున్
రాముడు  కాచు  నా మనము  

    రాపిడి బొందిన వేళలందు  నా
రాముడు నాకు రక్షకుడు  

    రాముడు సర్వము నాకు నిత్యమున్


(పద్యం వ్రాసిన తేదీ: 2012-12-29)

రామ యను మాట రెండక్షరములె గాని


తే.గీ. రామ యను మాట రెండక్షరములె గాని
రాము డారయ నక్షరబ్రహ్మ మగుట
రామ మంత్రంబునకు సాటి రాదగినది
భూమిపై లేదు  దివి లేదు పుట్టబోదు    



(ఈ‌ పద్యం రచించిన తేదీ: 2012-12-29)

22, జనవరి 2013, మంగళవారం

శ్రీరామచంద్రమూర్తికి


కం. శ్రీరామచంద్రమూర్తికి
కారుణ్యాలయున కేను కడు భక్తుడ నే
శ్రీరామా యని పిలచిన
నా రాముడు పలుకు చుండు నా కేవేళన్



ఈ నాటినుండి పాహిరామప్రభో అనే శీర్షికతో ధారావహికగా కొన్ని పద్యాలు ప్రకటిస్తున్నాను.
ఇది శతకం కాదని దయచేసి గమనించగలరు.
ఈ‌ కృతి ముఖ్యోద్దేశం రామభక్తులకు సులభపఠనీయంగా ఉండే  హృద్యపద్యవిరచనమే.
ఈ‌పద్యాలు రామభక్తి పరాయణులకు ఆనందం కలిగించగలవని నా విశ్వాసం.
ఎప్పటికప్పుడు మీ అభిప్రాయాలు తప్పక తెలియజేయగలరు.

(ఈ‌ పద్యం రచించిన తేదీ: 2012-12-29)

16, జనవరి 2013, బుధవారం

ఒద్దిక నుంటిని నేను

ఒద్దిక నుంటిని నేను విడచి పో
వద్దని వేడు చుంటిని నేను

న్నుల ముందున్నటులుండి
కన్ను మరుగాయే విద్యను
వన్నెకాడా చూపవలదని
విన్నవించిన వినకపోతివి

నటన నేర్చిన నాయకుడవే
యెటుల నిన్నాకట్టు కొందును
దిటవుగా నిను నమ్మియుంటిని
కటకట కడు కఠినుడ రామ
 
ముద్దుముద్దుగ నేనె నీవని
యద్ది యూహ నా మనసున
కొద్దిగ నే మైమరచి యుండగ
సద్దు చేయక జారిపోదువు