31, మే 2012, గురువారం

పూవులు చాలా పూచినవి నీ పూజకు తరలి వచ్చినవి

పూవులు చాలా పూచినవి నీ పూజకు తరలి వచ్చినవి
కోవెల వాకిలి చేరినవి నెత్తావులు జిమ్ముచు నిలచినవి

రంగురంగుల రేకులతో ఉప్పొంగే తీయని తేనెలతో
పొంగుతు నీకై విరిసినవి గుడి ముంగిలి చేరి వేచినవి
బంగరుతల్లులు పూబాలలు చేరంగ వచ్చెనీ చరణములు
మంగళకర నీ వెరిగినదైనను సంగతి విశదము చేసితిని

మాలాకారులు సూదులు గుచ్చగ లోలో నిన్నే తలచినవి
వేళకు నీ గళ సీమకు చేరగ వైళమ గుడికి చేరినవి
బేలలు పూవులబాలలు ఆశగ వేచియున్నవి రామయ్యా
కాలము గడువగ నీయకయా మాలలు వాడగ నీయకయా

ఎంతో తపమును చేసినవి నీ చెంత చేర ప్రభవించినవి
సంతోషముగా నీ గుడి వద్దకు సరగున వచ్చి చేరినవి
అంతర్యామివి పూలపాపల అంతరంగముల నెరుగుదువు రా
వింతువుగా మన్నింతువుగా నీ వెంతయు కరుణామయుడవుగా