14, మే 2012, సోమవారం

ఎవరేమి యన్న దోయిలి యొగ్గి యుంటిని

ఎవరేమి యన్నను దోయిలి యొగ్గి యుంటిని
భువిని నింద పడకుండ నివసింప శక్యమే

నీ వింత వాడ వనుచు నిన్న పొగడిన నోరు
నీ వెంత వాడ వనుచు నేడు తెగడెడి సౌరు
భావించ నెంతేనియు బాధించ కుండునా
యేవారిని తప్పెంచి యేమిలాభము కాన

నీ యందే నాబుధ్ధి నిలిచి యుండుట తెలియ
నీ యల్పల బుధ్దుల కెట్లు సాధ్యం బగును
వాయివిడచి తప్పులుపట్టి చూపింతునో
నా యల్ప బుధ్ధి నెన్ని నవ్వు నిధ్ధర  గాన

వచ్చి చూచినది చాలు భగవంతుడా జనులు
మెచ్చి యిచ్చినది చాలు మేలు మేలిక నైన
నచ్చమైన బ్రతుకేదో యదియె నీవిచ్చుచో
రచ్చచేయు మాయను రామా గెలుతు గాన


2 కామెంట్‌లు:

  1. తిట్లు పొగిడింపులును దాటు తీరు దెలిసి
    భగవదారాధనా నిష్ఠ పాదుకొన్న
    మీకు వేదన దైవసామీప్యములకె
    గాక వేరొండు గలుగునే ? ఘనుడ ! చూడ

    బ్లాగు సుజన-సృజన

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.