17, మే 2012, గురువారం

కోరి కోరి వచ్చితినా కువలయమునకు

కోరి కోరి వచ్చితినా కువలయమునకు నిన్ను
చేరి యుండియుండి విసివి చెడిపోయితినా

అచ్చట లేకున్న వేమి యిచ్చట గలవయ్య
ముచ్చటలా మురిపాలా మోహ మేల గాని
యిచ్చకాలు మాని యింక నెప్పటివలెనే
వచ్చి తొల్లింట నుండ వచ్చు ననుము రామ

నిను గన రానట్టి చోట నెట్టు లుందు నయ్య
మనుజలోకవిలాసాల మాట యేల గాని
కనుగొని నా తహతహ నిక కనికరించ వయ్య
వెనుకటి వలె నుండు మనుచు పిలిపించుము రామ

మాయ తిత్తులందు నేను మసలు టెందు కయ్య
ఆ యము డను వాని తోడ నల్లరేల గాని
న్యాయ మెంచి మునుపటి వలె నన్ను కటాక్షించి
హాయిగ నీకడ నుండగ నాన తిమ్ము రామ


2 కామెంట్‌లు:

  1. శ్యామల రావు గారు,

    నమస్కారం.మీ బ్లాగు చూసాను.చాలా బాగున్నది.

    మీవంటి తెలుగును ప్రేమించే పెద్దలు ఉన్నందునే మన నేల మీద తెలుగు ఇంకా బతికి ఉన్నది.

    మీ స్పందన వ్రాసినందుకు ధన్యవాదాలు.

    పాలపర్తి ఇంద్రాణి.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.