14, మే 2012, సోమవారం

శ్రీనేమాని రామజోగి సన్యాసి రావుగారి ఆశీర్వచనములు.

శ్రీనేమానివారు గురువారం మే ౩న జరిగిన నా షష్ఠిపూర్తి సందర్భముగా అనుగ్రహించిన ఆశీర్వచనాలు.
వీటిని నాటి సాయంత్రం జరిగిన కార్యక్రమంలో మా మేనమామగారు శ్రీ ఆత్రేయపురపు పాండురంగ విఠల్ ప్రసాద్ గారు చదివి అందించారు. కారణాంతరాల వలన వీటిని బ్లాగులో ప్రకటించడం ఆలస్యం అయినది.
ఈ ఆశీర్వచనములను  శ్రీ కంది శంకరయ్యగారు తమ శంకరాభరణం బ్లాగులో మే ౩నే  ప్రచురించారు.(http://kandishankaraiah.blogspot.in/2012/05/blog-post_03.html)


నేడు షష్ఠిపూర్తి మహోత్సవము జరుగుతున్న సందర్భమున 
శుభాశీస్సులు

శ్రీరస్తు విశుద్ధ యశ
శ్శ్రీరస్తు చిరాయురస్తు శ్రీకంఠకృపా
సారశ్రీకలిత విశే
షారోగ్య ప్రాప్తిరస్తు శ్యామలరాయా!


ఆదిత్యాది గ్రహమ్ములన్నియును శ్రీరస్తంచు యోగోన్నతుల్
మోదంబొప్పగ గూర్చుగాక! కరుణాంభోరాశు లార్యాశివుల్
వేదస్తుత్యులు సర్వమంగళములన్ వేడ్కన్ ప్రసాదింప నా
హ్లాదంబొప్ప చిరాయురున్నతులతో రాజిల్లుమా మిత్రమా!


అతుల పుణ్యదంపతులయి యలరినట్టి
రంగమణికిని సత్యనారాయణునకు
పుత్రరత్నమవును  కులాంభోధి పూర్ణ
చంద్రుడవగు నీకు శుభాశిషములు గూర్తు


శారద చారుశీల విలసద్గుణ లక్షణరాశి రమ్య సం
సారమునందు పత్నిగ సమస్త సుఖమ్ములు గూర్చుచుండ వి
ద్యారతులైన బిడ్డలు నిరంతరమున్ ప్రమదమ్ము నింపగా
సూరి వరేణ్య!  పృథ్వి బహుశోభలు గాంచుము శ్యామలాహ్వయా!


అరువది వత్సరమ్ములు సమస్త శుభప్రద జీవితాన సం
బరమున సాగె నేర్చితివి బాగుగ విద్యలు యోగరాశులున్
కరము ముదాన పొందితివి ఖ్యాతి గడించితి వీశుసత్కృపన్
బరగుము దీర్ఘకాలమిల వంశవిభూషణమై శుభాశయా!


నేమాని రామజోగి సన్యాసి రావు
విశాఖపట్టణము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.