23, మే 2012, బుధవారం

పండువే యగునయ్య భావాంబరవీధి

పండువే యగునయ్య భావాంబరవీధి
మెండుగా నీ తలపు మెదలు నట్టి దినము

నిండుగా నీవందు నిలచియుండుట చేత
నుండుటకు తావు లేకుండి దురూహలకు
దండిగా శాంతి హృదంతరంబున కగుచు
నుండగా సుఖముగా నుండగా నాకు

మరల మరల నీవు మహితదయావృష్టి
కురిసి సంతోషమే కొల్లగా పండించి
మురిపించగా తనువు మరిపించగా నగుచు
పరమసుఖానంద పరవశుడగు నాకు

చ్యుతిలేని నీకలిమి శోభిల్లు నా యెడద
ధృతియుక్తమై యోగస్థితి నిష్టమై నిలచి
ప్రతి చోట పండువై ప్రతిదినము పండువై
అతులితసుఖస్థితి ననుభవింతు రామ 


( ఎవరో శ్రీ kishore గారు క్రిందటి గీతం "ఈ చిన్నపూజకు నన్ను మన్నించవయ్యా అనే దానికి"aaaa....mannincham le! pandaga chesuko!" అని కామెంటు పెట్టారు.  దానికి సమాధానం వ్రాయటానికి బదులు పొరబాటున దాన్ని తొలగించాను.  అలా చేసినందుకు విచారిస్తున్నాను.  పండుగ చేసుకోకేమి!  నా కెప్పుడూ పండగే ఆయన దయవలన.  అది తెలియజేసుకోవాలనే, వివరించాలనే ప్రస్తుత గీతం. ఏది వెలువడినా అది ఆయన ఆదేశం మేరకేనని నా విశ్వాసం. స్వస్తి. )

2 కామెంట్‌లు:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.