31, మే 2012, గురువారం

పూవులు చాలా పూచినవి నీ పూజకు తరలి వచ్చినవి

పూవులు చాలా పూచినవి నీ పూజకు తరలి వచ్చినవి
కోవెల వాకిలి చేరినవి నెత్తావులు జిమ్ముచు నిలచినవి

రంగురంగుల రేకులతో ఉప్పొంగే తీయని తేనెలతో
పొంగుతు నీకై విరిసినవి గుడి ముంగిలి చేరి వేచినవి
బంగరుతల్లులు పూబాలలు చేరంగ వచ్చెనీ చరణములు
మంగళకర నీ వెరిగినదైనను సంగతి విశదము చేసితిని

మాలాకారులు సూదులు గుచ్చగ లోలో నిన్నే తలచినవి
వేళకు నీ గళ సీమకు చేరగ వైళమ గుడికి చేరినవి
బేలలు పూవులబాలలు ఆశగ వేచియున్నవి రామయ్యా
కాలము గడువగ నీయకయా మాలలు వాడగ నీయకయా

ఎంతో తపమును చేసినవి నీ చెంత చేర ప్రభవించినవి
సంతోషముగా నీ గుడి వద్దకు సరగున వచ్చి చేరినవి
అంతర్యామివి పూలపాపల అంతరంగముల నెరుగుదువు రా
వింతువుగా మన్నింతువుగా నీ వెంతయు కరుణామయుడవుగా

10 కామెంట్‌లు:

  1. సార్, కవిత చాలా ఉన్నతంగా ఉన్నది , వచన కవిత్వమే అయినా పదాలు కొన్ని అర్ధం కాలేదు " వైళమ " ఈ పద అర్ధం తెలియ లేదు . మీరు చాలా బాగా రాస్తారు. పుష్ప విలాపం చదివినట్లుగా ఉంది

    రిప్లయితొలగించండి
  2. ఫాతిమా గారు,
    మీకు నచ్చినందుకు సంతోషం.
    మీరన్నట్లు ఈ రచనను వచన కవిత్వంగా చదివి ఆనందించ వచ్చును.
    పాటగా గానం చేసుకొనీ ఆనందించ వచ్చును.

    వైళమ అన్నది వైళముగా అన్నదానికి రూపాంతరం. వైళముగా అంటే త్వరగా అని అర్థం.
    తెలుగుసినీసాహిత్యానికి యెక్కిన తెలుగు మాటయే యిది.
    శ్రీకృష్ణార్జున యుద్ధము (1962) సినిమా కోసం శ్రీ పింగళి నాగేంద్రరావుగారు వ్రాసిన పాట ఉంది
    స్వాముల సేవకు వేళాయే సైళమ రారే చెలులారా
    ఆశీర్వాదము లభించుగా చేసే పుజలు ఫలించుగా
    అనే పల్లవితో సాగే యీ పాటను శ్రీమతి సుశీలగారు గానం చేసారు.

    రిప్లయితొలగించండి
  3. చాలా బాగుంది. పూల మనసేమిటో.ఎంత చక్కగా చెప్పారు. ఏ పూలైనా స్వామి పాదాల దగ్గరకు చేరాల్సినవే కదా!
    చాలా చాలా బాగుంది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  4. చాలా బాగుందండీ!
    పూల మనసులో చేరి వ్రాసినట్లు ఉందండీ!
    @శ్రీ

    రిప్లయితొలగించండి
  5. మీ రాత ఒక రెండు వాక్యాల ఆలోచనకు కారణమైంది....

    చెట్టు /కొమ్మ - భర్త
    పువ్వు - భార్య

    మీకు విచిత్రంగా అనిపించవచ్చునేమో కానీ వేరుపడిన భార్య వితంతువయ్యిందేమో అనిపించింది ఈ క్షణంలో....ఆ వితంతువుకు ఈ పాదాలే "మోక్షం" అని ఆ దయామయుడు నిర్ణయిస్తాడేమో అని కూడా అనిపించింది....ఇంకా చాలా అనిపించినై కానీ, మీలాగా ఊపు ఉన్న కైతలు రాయగలిగే రాతగాడిని కాదు కాబట్టి ఆపేసా.... :)

    అయితే వేరుపడిన / వితంతువైన భార్యను ఆదరించేవారు కొందరు, నలిపేసేవారు కొందరు, ఆశీర్వదించేవారు కొందరు - అది వేరే సంగతి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వంశీమోహనుగారూ
      చెట్టు లేదా మొక్కకూ దానితో పూవుకూ కల అనుబంధం తల్లీబిడ్డా బంధం.
      కవులు సాంప్రదాయికంగా యిలాగునే భావించి వర్ణించటం జరుగుతోంది.
      మీరన్న భర్త-భార్య సంబంధం అసంగతంగా అనిపిస్తొంది. ఈ అసంగతమైన ఊహను మీరు మరికొంత దూరం సాగదీసారేమో.

      తొలగించండి
  6. వంశీ మోహన్ నీది ఎంత విషపు ఆలోచన. పువ్వు నేలరాలితే" ఆదరించే వారు కొందరు నలిపేసేవారు కొందరు, ఆశీర్వదించేవారు కొందరు - అది వేరే సంగతి." ఇలా అనిపించిందా? మీ సొంత పూలతోటలో ఎన్ని పూలు విడివడ్డాయి ఆ పూలని ఎంతమంది ఆదరించారు,ఎంతమంది ఆశీర్వదించారు ,ఎంత మంది నలిపేసారు?భలే నిరూపించుకున్నావే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు చెప్పింది నిజం. చక్కటి కవితను ఆస్వాదించక, కొందరికి అలాంటి నీచ నికృష్టపు ఆలోచనలు ఎలా వస్తాయో కదా.

      తొలగించండి
  7. గురువుగారు.. కవిత చాలా బాగుందండి!

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.