18, మే 2012, శుక్రవారం

ఈ చిన్నపూజకు నన్ను మన్నించవయ్యా

నిన్ను పూజించుకో నీయవయ్యా యీ
చిన్నపూజకు నన్ను మన్నించవయ్యా

ఎవెరెవరో పూలు తెచ్చి యిచ్చినారు నీ పూజకు
ఎందుకొచ్చిన పూలయా యేమి పూజయా
అందాలు చిందు పూవు లంతలోనె వాడెనయా
అందుకే నా మనః పుష్ప మందుకో రామ

ఎవెరెవరో ధూపముల  నిచ్చినారు నీ పూజకు
ఎందుకొచ్చిన  ధూపము లేమి పూజయా
యెందాక నిలచె తావు లిట్టే తొలగెనే రామ
అందుకో నా సంస్కార మందించు తావులు

ఎవెరెవరో పండ్లు తెచ్చి యిచ్చినారు నీ పూజకు
ఎందుకొచ్చిన  పండ్లయా యా యేమి పూజయా
అందేవి స్వాదువులని యరయ రాదాయెనయా
అందుకే నా పుణ్యఫలము లందుకో రామ