23, మే 2012, బుధవారం

పూవుల జాతి అంతా నీ పాదాల వద్దకు పరువెత్తుకు వస్తోంది

అనుక్షణం ఎక్కడో ఒక చోట తెలతెలవారుతూనే ఉంది
అనుక్షణం లక్షలాది కనురెప్పలు విప్పారుతూ ఉన్నాయి


వేలాది కరచరణాలు పుష్పాపచయవిన్యాసం చేస్తున్నాయి
పూలబాలలు వేలు లక్షలుగా బుట్టల్లోకి చేరుతున్నాయి
 

నామాలు జోడించి మరీ నీ మీదకు విసిరేస్తున్న చేతులు
కోమలపుష్పాలు గాయపడుతున్న దేమాత్రం గమనించవు
 

బుట్టలోనే ఊపిరాడక మూర్ఛపోయిన పుష్పాలుంటాయి
గుట్టగా పడి కొట్టుకుని గుండెలాగిపోయిన పూవులుంటాయి
 

నూటెనిమిదో మరోవెయ్యో నామాలని నోరు చదివేయగానే
నేటికి ప్రత్యూషపూజావిధానం నిశ్చయంగా ముగుస్తుంది
 

అంతటితో అనేక మందికి అవసరపూజ ముగుస్తుంది
అంతకుముందే లక్షలపూబాలల ఆయువూ ముగుస్తుంది

ఇంతా చేసి యెక్కడో ఒక గుండె  యే ఒక్క దివ్య నామాన్నో
సంతోషాతిరేకంతో స్మరించి పూవును సమర్పిస్తోంది నీకు
 

ఆ విధంగా రోజు కొక పూవు నీ పాదాల నలంకరించినా చాలని
పూవుల జాతి అంతా నీ పాదాల వద్దకు పరువెత్తుకు వస్తోంది