23, మే 2012, బుధవారం

ప్రభూ నీ విలాసము ప్రకృతిలో సమస్తము

ప్రభూ నీ విలాసము   ప్రకృతిలో సమస్తము
అభయప్రద యనిశము నిను   హాయిగ కొనియాడుదుము

ఇది చీకటి యిది వెలుగని యెవరు నిర్ణయించిరి
ఇది మంచిది యిది చెడుగని యెవరు నిర్ణయించిరి
కనులు వెలుగు చూచుట యది కాద నీ విలాసము
మనసు మంచి చూచుట యది కాది నీ విలాసము

ఇది సుఖ మిది దుఃఖమని యెవరు నిర్ణయించిరి
ఇది శుభ మిది యశుభమని యెవరు నిర్ణయించిరి
మనసున విషయానుభూతి కాద నీ విలాసము
తనువు తొడగి విడచుట యది కాద నీ విలాసము

ఇది యిహ మిది పరమని యెవరు నిర్ణయించిరి
ఇది యాత్మ యనాత్మ యిదని యెవరు నిర్ణయించిరి
దృశ్యమదృశ్యంబు సకల జగము  నీ విలాసము
అజ్ఞేయము నప్రమేమ మైనది నీ విలాసము