31, మే 2012, గురువారం

పూవులు చాలా పూచినవి నీ పూజకు తరలి వచ్చినవి

పూవులు చాలా పూచినవి నీ పూజకు తరలి వచ్చినవి
కోవెల వాకిలి చేరినవి నెత్తావులు జిమ్ముచు నిలచినవి

రంగురంగుల రేకులతో ఉప్పొంగే తీయని తేనెలతో
పొంగుతు నీకై విరిసినవి గుడి ముంగిలి చేరి వేచినవి
బంగరుతల్లులు పూబాలలు చేరంగ వచ్చెనీ చరణములు
మంగళకర నీ వెరిగినదైనను సంగతి విశదము చేసితిని

మాలాకారులు సూదులు గుచ్చగ లోలో నిన్నే తలచినవి
వేళకు నీ గళ సీమకు చేరగ వైళమ గుడికి చేరినవి
బేలలు పూవులబాలలు ఆశగ వేచియున్నవి రామయ్యా
కాలము గడువగ నీయకయా మాలలు వాడగ నీయకయా

ఎంతో తపమును చేసినవి నీ చెంత చేర ప్రభవించినవి
సంతోషముగా నీ గుడి వద్దకు సరగున వచ్చి చేరినవి
అంతర్యామివి పూలపాపల అంతరంగముల నెరుగుదువు రా
వింతువుగా మన్నింతువుగా నీ వెంతయు కరుణామయుడవుగా

23, మే 2012, బుధవారం

ప్రభూ నీ విలాసము ప్రకృతిలో సమస్తము

ప్రభూ నీ విలాసము   ప్రకృతిలో సమస్తము
అభయప్రద యనిశము నిను   హాయిగ కొనియాడుదుము

ఇది చీకటి యిది వెలుగని యెవరు నిర్ణయించిరి
ఇది మంచిది యిది చెడుగని యెవరు నిర్ణయించిరి
కనులు వెలుగు చూచుట యది కాద నీ విలాసము
మనసు మంచి చూచుట యది కాది నీ విలాసము

ఇది సుఖ మిది దుఃఖమని యెవరు నిర్ణయించిరి
ఇది శుభ మిది యశుభమని యెవరు నిర్ణయించిరి
మనసున విషయానుభూతి కాద నీ విలాసము
తనువు తొడగి విడచుట యది కాద నీ విలాసము

ఇది యిహ మిది పరమని యెవరు నిర్ణయించిరి
ఇది యాత్మ యనాత్మ యిదని యెవరు నిర్ణయించిరి
దృశ్యమదృశ్యంబు సకల జగము  నీ విలాసము
అజ్ఞేయము నప్రమేమ మైనది నీ విలాసము

పూవుల జాతి అంతా నీ పాదాల వద్దకు పరువెత్తుకు వస్తోంది

అనుక్షణం ఎక్కడో ఒక చోట తెలతెలవారుతూనే ఉంది
అనుక్షణం లక్షలాది కనురెప్పలు విప్పారుతూ ఉన్నాయి


వేలాది కరచరణాలు పుష్పాపచయవిన్యాసం చేస్తున్నాయి
పూలబాలలు వేలు లక్షలుగా బుట్టల్లోకి చేరుతున్నాయి
 

నామాలు జోడించి మరీ నీ మీదకు విసిరేస్తున్న చేతులు
కోమలపుష్పాలు గాయపడుతున్న దేమాత్రం గమనించవు
 

బుట్టలోనే ఊపిరాడక మూర్ఛపోయిన పుష్పాలుంటాయి
గుట్టగా పడి కొట్టుకుని గుండెలాగిపోయిన పూవులుంటాయి
 

నూటెనిమిదో మరోవెయ్యో నామాలని నోరు చదివేయగానే
నేటికి ప్రత్యూషపూజావిధానం నిశ్చయంగా ముగుస్తుంది
 

అంతటితో అనేక మందికి అవసరపూజ ముగుస్తుంది
అంతకుముందే లక్షలపూబాలల ఆయువూ ముగుస్తుంది

ఇంతా చేసి యెక్కడో ఒక గుండె  యే ఒక్క దివ్య నామాన్నో
సంతోషాతిరేకంతో స్మరించి పూవును సమర్పిస్తోంది నీకు
 

ఆ విధంగా రోజు కొక పూవు నీ పాదాల నలంకరించినా చాలని
పూవుల జాతి అంతా నీ పాదాల వద్దకు పరువెత్తుకు వస్తోంది

పండువే యగునయ్య భావాంబరవీధి

పండువే యగునయ్య భావాంబరవీధి
మెండుగా నీ తలపు మెదలు నట్టి దినము

నిండుగా నీవందు నిలచియుండుట చేత
నుండుటకు తావు లేకుండి దురూహలకు
దండిగా శాంతి హృదంతరంబున కగుచు
నుండగా సుఖముగా నుండగా నాకు

మరల మరల నీవు మహితదయావృష్టి
కురిసి సంతోషమే కొల్లగా పండించి
మురిపించగా తనువు మరిపించగా నగుచు
పరమసుఖానంద పరవశుడగు నాకు

చ్యుతిలేని నీకలిమి శోభిల్లు నా యెడద
ధృతియుక్తమై యోగస్థితి నిష్టమై నిలచి
ప్రతి చోట పండువై ప్రతిదినము పండువై
అతులితసుఖస్థితి ననుభవింతు రామ 


( ఎవరో శ్రీ kishore గారు క్రిందటి గీతం "ఈ చిన్నపూజకు నన్ను మన్నించవయ్యా అనే దానికి"aaaa....mannincham le! pandaga chesuko!" అని కామెంటు పెట్టారు.  దానికి సమాధానం వ్రాయటానికి బదులు పొరబాటున దాన్ని తొలగించాను.  అలా చేసినందుకు విచారిస్తున్నాను.  పండుగ చేసుకోకేమి!  నా కెప్పుడూ పండగే ఆయన దయవలన.  అది తెలియజేసుకోవాలనే, వివరించాలనే ప్రస్తుత గీతం. ఏది వెలువడినా అది ఆయన ఆదేశం మేరకేనని నా విశ్వాసం. స్వస్తి. )

18, మే 2012, శుక్రవారం

ఈ చిన్నపూజకు నన్ను మన్నించవయ్యా

నిన్ను పూజించుకో నీయవయ్యా యీ
చిన్నపూజకు నన్ను మన్నించవయ్యా

ఎవెరెవరో పూలు తెచ్చి యిచ్చినారు నీ పూజకు
ఎందుకొచ్చిన పూలయా యేమి పూజయా
అందాలు చిందు పూవు లంతలోనె వాడెనయా
అందుకే నా మనః పుష్ప మందుకో రామ

ఎవెరెవరో ధూపముల  నిచ్చినారు నీ పూజకు
ఎందుకొచ్చిన  ధూపము లేమి పూజయా
యెందాక నిలచె తావు లిట్టే తొలగెనే రామ
అందుకో నా సంస్కార మందించు తావులు

ఎవెరెవరో పండ్లు తెచ్చి యిచ్చినారు నీ పూజకు
ఎందుకొచ్చిన  పండ్లయా యా యేమి పూజయా
అందేవి స్వాదువులని యరయ రాదాయెనయా
అందుకే నా పుణ్యఫలము లందుకో రామ

17, మే 2012, గురువారం

కోరి కోరి వచ్చితినా కువలయమునకు

కోరి కోరి వచ్చితినా కువలయమునకు నిన్ను
చేరి యుండియుండి విసివి చెడిపోయితినా

అచ్చట లేకున్న వేమి యిచ్చట గలవయ్య
ముచ్చటలా మురిపాలా మోహ మేల గాని
యిచ్చకాలు మాని యింక నెప్పటివలెనే
వచ్చి తొల్లింట నుండ వచ్చు ననుము రామ

నిను గన రానట్టి చోట నెట్టు లుందు నయ్య
మనుజలోకవిలాసాల మాట యేల గాని
కనుగొని నా తహతహ నిక కనికరించ వయ్య
వెనుకటి వలె నుండు మనుచు పిలిపించుము రామ

మాయ తిత్తులందు నేను మసలు టెందు కయ్య
ఆ యము డను వాని తోడ నల్లరేల గాని
న్యాయ మెంచి మునుపటి వలె నన్ను కటాక్షించి
హాయిగ నీకడ నుండగ నాన తిమ్ము రామ


16, మే 2012, బుధవారం

ఉదయమే పడకదిగి యుదరపోషణార్థమై

ఉదయమే పడకదిగి యుదరపోషణార్థమై
కదలి వేవేగ యింటి గడప దాటి పోవలెగా

ఎఱుకపరచు పుస్తకముల నెప్పుడు జదివేది
ఎఱుకగలుగు వారి సేవ నెప్పుడు జేసేది
కరువు దీర నీపూజల గావించు టెప్పుడు
పరమపుణ్యక్షేత్రముల దరిసించు టెప్పుడు

విమలచిత్తు డగుచు నున్న విద్వాంసు డైనను
భ్రమలు విడచి వైరాగ్యపు బాటలో నున్నను
శ్రమపడక దినము గడచు సాధనమే లేక
సమయ మేది బోధ బడయ సాధనలో దనియ

అన్నిటికిని నీవే గల వన్న బుధ్ధి గలిగి
నిన్ను నమ్మి యుందు గాక నేనేమి  చేయుదు
మిన్నకుంటి నిన్ను మరచి యన్న తలపు లేక
మన్నించి రామచంద్ర నన్ను  కావ వయ్య

15, మే 2012, మంగళవారం

నీ యంత వాడవు నీవు నా యంత వాడను నేను

నీ యంత వాడవు నీవు నా యంత వాడను నేను
ఏ మంత బేధము లేదు లేదిటు చూడవయ్య

ధర్మరక్షణ కొరకు తరచు వచ్చుచుందువు నీవు
కర్మభక్షణ కొరకు కదలి వచ్చుచుందును నేను

మాయ నీ వ్రేలి కొసల  యాన మసలుచు నుండును
మాయ నా మానసము లోన మసలుచు నుండును

నీవు చూడ గుణరహితుడవు నాకు సన్నిహితుడవు
నేను కూడ గుణరహితుడను నీకు సన్నిహితుడను

14, మే 2012, సోమవారం

ఎవరేమి యన్న దోయిలి యొగ్గి యుంటిని

ఎవరేమి యన్నను దోయిలి యొగ్గి యుంటిని
భువిని నింద పడకుండ నివసింప శక్యమే

నీ వింత వాడ వనుచు నిన్న పొగడిన నోరు
నీ వెంత వాడ వనుచు నేడు తెగడెడి సౌరు
భావించ నెంతేనియు బాధించ కుండునా
యేవారిని తప్పెంచి యేమిలాభము కాన

నీ యందే నాబుధ్ధి నిలిచి యుండుట తెలియ
నీ యల్పల బుధ్దుల కెట్లు సాధ్యం బగును
వాయివిడచి తప్పులుపట్టి చూపింతునో
నా యల్ప బుధ్ధి నెన్ని నవ్వు నిధ్ధర  గాన

వచ్చి చూచినది చాలు భగవంతుడా జనులు
మెచ్చి యిచ్చినది చాలు మేలు మేలిక నైన
నచ్చమైన బ్రతుకేదో యదియె నీవిచ్చుచో
రచ్చచేయు మాయను రామా గెలుతు గాన


శ్రీనేమాని రామజోగి సన్యాసి రావుగారి ఆశీర్వచనములు.

శ్రీనేమానివారు గురువారం మే ౩న జరిగిన నా షష్ఠిపూర్తి సందర్భముగా అనుగ్రహించిన ఆశీర్వచనాలు.
వీటిని నాటి సాయంత్రం జరిగిన కార్యక్రమంలో మా మేనమామగారు శ్రీ ఆత్రేయపురపు పాండురంగ విఠల్ ప్రసాద్ గారు చదివి అందించారు. కారణాంతరాల వలన వీటిని బ్లాగులో ప్రకటించడం ఆలస్యం అయినది.
ఈ ఆశీర్వచనములను  శ్రీ కంది శంకరయ్యగారు తమ శంకరాభరణం బ్లాగులో మే ౩నే  ప్రచురించారు.(http://kandishankaraiah.blogspot.in/2012/05/blog-post_03.html)


నేడు షష్ఠిపూర్తి మహోత్సవము జరుగుతున్న సందర్భమున 
శుభాశీస్సులు

శ్రీరస్తు విశుద్ధ యశ
శ్శ్రీరస్తు చిరాయురస్తు శ్రీకంఠకృపా
సారశ్రీకలిత విశే
షారోగ్య ప్రాప్తిరస్తు శ్యామలరాయా!


ఆదిత్యాది గ్రహమ్ములన్నియును శ్రీరస్తంచు యోగోన్నతుల్
మోదంబొప్పగ గూర్చుగాక! కరుణాంభోరాశు లార్యాశివుల్
వేదస్తుత్యులు సర్వమంగళములన్ వేడ్కన్ ప్రసాదింప నా
హ్లాదంబొప్ప చిరాయురున్నతులతో రాజిల్లుమా మిత్రమా!


అతుల పుణ్యదంపతులయి యలరినట్టి
రంగమణికిని సత్యనారాయణునకు
పుత్రరత్నమవును  కులాంభోధి పూర్ణ
చంద్రుడవగు నీకు శుభాశిషములు గూర్తు


శారద చారుశీల విలసద్గుణ లక్షణరాశి రమ్య సం
సారమునందు పత్నిగ సమస్త సుఖమ్ములు గూర్చుచుండ వి
ద్యారతులైన బిడ్డలు నిరంతరమున్ ప్రమదమ్ము నింపగా
సూరి వరేణ్య!  పృథ్వి బహుశోభలు గాంచుము శ్యామలాహ్వయా!


అరువది వత్సరమ్ములు సమస్త శుభప్రద జీవితాన సం
బరమున సాగె నేర్చితివి బాగుగ విద్యలు యోగరాశులున్
కరము ముదాన పొందితివి ఖ్యాతి గడించితి వీశుసత్కృపన్
బరగుము దీర్ఘకాలమిల వంశవిభూషణమై శుభాశయా!


నేమాని రామజోగి సన్యాసి రావు
విశాఖపట్టణము

2, మే 2012, బుధవారం

వేడుకైన షష్టిపూర్తి వేళ నున్న బొమ్మ

అందరి మధ్యన నిలచి యాడెడు బొమ్మ
అందరితో కొసరి మాటలాడెడు బొమ్మ
అందముగ నీచేతుల నమరించిన బొమ్మ
అందందు త్రిప్పుచు నీ వాడించు బొమ్మ

అరువదేళ్ళుగా నిచట నాడుచున్న బొమ్మ
సరసమైన కదలికల చక్కనైన బొమ్మ

వేడుకైన షష్టిపూర్తి వేళ నున్న బొమ్మ
ఏడుగడ వీవాడించు నాటలాడు బొమ్మ

నీదు వ్రేలి కొసల చూపు నిలుపుకున్న బొమ్మ
కాదనక నీ యానతి కదలుచుండు బొమ్మ