విన్నప మాలించుమా పన్నగశయన నా
విన్నపము వినకున్న నిన్ను తిట్టనా
విన్నపములు విని కరిని వేవేగ బ్రోచిన హరి
విన్నపములు విని సతిని తిన్నగ నేలిన హరి
విన్నపములు చేయు నన్ను తిన్నగ రక్షించవో
అన్నన్నా ఆకథనము లన్నియు దబ్బర లందు
విన్నపమును చేసినంత విభీషణు నేలిన హరి
విన్నపములు నేను చేయ వినకుండు టేమిరా
విన్నవించి విన్నవించి విసిగి యూరుకోనురా
తిన్నగ శ్రీరామచంద్ర తిట్టుదురా పదుగురిలో
గిరి నెత్తిన కథ తప్పని కరి నేలిన కథ తప్పని
హరిభక్తుల వెంట నుందు వన్నమాట తప్పని
తరుణి కసలు నీవు వస్త్రదాన మీయ లేదని
పరమకఠినచిత్తుడ వని పదుగురు విన తిట్టుదురా