13, జనవరి 2025, సోమవారం

దండాలు దండాలు దండాలు

 

దండాలు దండాలు దండాలు

దండాలు శతకోటి దండాలు


నిగమాంతవేద్యునకు శ్రీరామచంద్రునకు 

    నీరేజనేత్రునకు దండాలు

జగదేకవీరునకు శ్రీరామచంద్రునకు 

    జానకీనాధునకు దండాలు

నగరాజధీరునకు శ్రీరామచంద్రునకు 

    నరనాథశ్రేష్ఠునకు దండాలు

ఖగరాజగమనునకు శ్రీరామచంద్రునకు 

    ఘననీలదేహునకు   దండాలు


పరమేష్ఠివినుతునకు శ్రీరామచంద్రునకు 

    పరమేశవినుతునకు దండాలు

సురనాథవినుతునకు శ్రీరామచంద్రునకు 

    హరినాథవినుతునకు దండాలు

సురలోకవినుతునకు శ్రీరామచంద్రునకు 

    నరలోకవినుతునకు దండాలు

కరుణాలవాలునకు శ్రీరామచంద్రునకు 

    వరదానశీలునకు దండాలు


ఇనకులోత్తంసునకు శ్రీరామచంద్రునకు 

    వనజాయతాక్షునకు దండాలు

మునిజనానందునకు శ్రీరామచంద్రునకు 

    మోహనాకారునకు దండాలు

దనుజసంహారునకు శ్రీరామచంద్రునకు 

    ధర్మస్వరూపునకు దండాలు

మనకష్టముల బాపు మన రామచంద్రునకు 

    మనసార పెట్టేము దండాలు