10, ఏప్రిల్ 2022, ఆదివారం

శ్రీరామ నీజన్మదినమయ్యా

శ్రీరామ నీజన్మదినమయ్యా నేడు 
    చైత్రశుధ్ధనవమి తిథియయ్యా

ఆరావణుని జంప అవతరించినట్టి
    నారాయణమూర్తి వీవయ్యా
ధారుణీ జనులకు ధర్మమార్గము జూప
    దయచేసిన శ్రీహరివయ్యా
కారుణ్యమూర్తివై కావుమన్న వారి
     కాపాడు దేవదేవుడవయ్యా
దారి తెన్ను లేని దారుణసంసార
    వారాశిదాటింతు వీవయ్యా

ధారాధరశ్యామ రవికులాంబుధిసోమ
     ధర్మస్వరూపుడవు నీవయ్యా
ఈరేడు లోకాల నేలు దేవుడ వీవు
      కూరిమి మమ్మేలు దొరవయ్యా
చేరి మ్రొక్కెడు వారు కోరు సంపదలెల్ల
      ధారాళముగ నిచ్చు తండ్రివయా
శూరలోకంబెల్ల చేరి కొల్చుచు నుండ
     శోభిల్లు దశరథసుతుడ వయ్యా

వారిజనాభుడవు భక్తపరిపాలనా
      పరమదీక్షాపరుడ వీవయ్యా
వారిజాక్షుండవు భయనాశకుడవును
       వరదాయకుడవును నీవయ్యా
వారిజాసనుడును వాసవుడు కామారి
       ప్రస్తుతించెడు విభుడ వీవయ్యా
వారిజమృదుపాద వందనంబులు నీకు
      బ్రహ్మాండనాయకుడ వీవయ్యా


       

2 కామెంట్‌లు:

  1. ఈకీర్తనలో పల్లవిని చరణాల తరువాత పాడటం కాక చరణాలలోని ప్రతి పాదం తరువాతా పాడటం బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమే, రామయ్యని ఎన్నిసార్లు పిలిచినా తృప్తి ఉండదు, కదా!

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.