5, మే 2019, ఆదివారం

రాముడా నీకృపను రానీయవయ్య


రాముడా నీకృపను రానీయవయ్య మేము
సామాన్యులము సంసారజలధిమగ్నులము

వేదశాస్త్రములలోని విషయంబు లెరుగము
వేదస్వరూపుడవై వెలుగొందు స్వామీ
మాదీనత కాస్త నీవు మన్నింపవలయును
నీ దయాలబ్ధి మాకు నిజమైన ధనము

పొట్టకూటి చదువులతో బుధ్ధి భ్రష్టుపట్టినది
వట్టిమాటలే కాని భక్తియేది స్వామీ
రట్టడి పను లింక మాన్పి రవ్వంత  మంచిదారి
పట్టించవయ్య మమ్ము భగవంతుడా

నిండనీ మా గుండెల నీయందు సద్భక్తిని
పండనీ మాజన్మలు భవముదాటి స్వామీ
కొండంత దయగల గోవిందుడా నీవే
యండవై అభయమిచ్చి యాదరించవే

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.