13, మే 2019, సోమవారం

సాకారబ్రహ్మమును సందర్శించ నీ కోరిక తీరు శబరి నేడోరేపో


సాకారబ్రహ్మమును సందర్శించ
నీ కోరిక తీరు శబరి నేడోరేపో

సతిని వెదకికొనుచు రామచంద్రుడై వచ్చు
నతివ శ్రీహరి శేషు డనుజుడై వచ్చు
నతని లక్ష్మణు డండ్రు నా యిర్వుర నంత
అతిభక్తి గొల్చి చరితార్ధురాల వగుదువు

వినుము హరి దేవతలు విన్నవించగను
చనుదెంచెను రాముడై దనుజుల దునుమ
అనుగమించి సీతయై ఆదిలక్ష్మి వచ్చె
వనవాసము రామలీల వనితరో వినుము

వివిధవనఫలములతో విందొనరించి
ధవళాక్షుడు రాముని దయను పొందుము
అవల బ్రహ్మపదమునకు నరుగ వచ్చును
భువిని నీపేరు నిలచిపోవును నిజము

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.