11, మే 2019, శనివారం

వట్టి వెఱ్ఱివాడ నని భావించేవో


వట్టి వెఱ్ఱివాడ నని భావించేవో నా
పట్టుదల నెఱుగవో పరమపూరుష

ఎన్నెన్ని జన్మలెత్తి యేమి లాభమోయి నే
నన్ని జన్మలందు కూడ నజ్ఞాని నైతి
నిన్నాళ్ళకు మోసమొఱిగి యింకపుట్ట నంటె యీ
చిన్న కోరికను గూర్చి యెన్నడు మాట్లాడవు

ఎంత గొప్ప వాడవైన నేమి లాభమోయి నా
చింత దీర్చువాడ వగుచు చెంత చేరక
రంతుకాడ నీ యాటల రహస్యమును తెలిసి నే
పంతగించి మాయనెల్ల భంగపరచి రానా

ఎందు నీవు దాగినను యేమి లాభమోయి నా
కందివచ్చి నీదు నామ మమరె నోటను
వందనము శ్రీరామబ్రహ్మమా నీ నామమె
యందించెను చింతదీరు నట్టి సదుపాయము

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.