17, మే 2019, శుక్రవారం

నమ్మరాని లోకమును నమ్మి భంగపడితి నమ్మదగిన నిన్ను నేను నమ్మక చెడితి


నమ్మరాని లోకమును నమ్మి భంగపడితి
నమ్మదగిన నిన్ను నేను నమ్మక చెడితి

పలికినట్టి పలుకు లేవొ పలికితిని పలుగాకి
వలె నిపుడు  రామజప పరుడ నైతిని
కలలనైన నీవు నా తలపులలో నిండగ
నిలువరించ రాని కలి నిలువలేక పారె నిదే

అయినదేమొ అయిన దని యనుకొందురా యింక
పయిన నీ మాటనే పాటించెదరా
నయముకాని రోగము నా లోకమోహ మిదే
నయమాయెనురా నీ నామసంకీర్తనమున

జరిగిన దేదో జరిగె చాల బాధల కిదే
తెర పడినది నీనామ స్ఫురణము కలిగి
మరల తప్పు దారులకు మరలిపోవక నన్ను
కరుణించవయ్య నీవు కమలాక్షుడా యింక

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.