27, మే 2019, సోమవారం
కృపజూడవయా నృపశేఖర
కృపజూడవయా నృపశేఖర నే
నపరాధిని కానని యెంచవయా
మనసా నిను నమ్మిన వాడనురా
విను మన్యుల నెన్నని వాడనురా
వనజేక్షణ యాపద లాయెనురా
యినవంశవిభో నను కావవయా
హరి సేవకు లెవ్వరితో కలి యే
పరియాచకముల్ పచరించదని
ధర నెంతయు వార్తగ నున్నదిరా
మరి దానిని దబ్బర సేయకురా
పరమాత్ముడ యాపద లాయెనురా
హరి నీదయ చాలని నమ్మితిరా
దరి జేర్చవయా కరుణాలయ నా
తరమా భవసాగర మీదగను
శ్రీకాంతు డున్నాడు శ్రీరాముడై
శ్రీకాంతు డున్నాడు శ్రీరాముడై
మీకు మాకు నందరకు మేలు మేలనగ
దేవమానవులకు దిట్టమైనట్టి మేలు
భావించి నరునిగా వచ్చినవాడు
రావణాసురుని తలలు రాలగొట్టిన వాడు
కేవలధర్మాకృతిగ క్షితిని తోచువాడు
చింతలన్ని తీర్చువాడు చిన్మయుడగువాడు
చెంతచేరు జనుల రక్షించెడు వాడు
పంతగించి ధర్మేతరప్రవృత్తి నడచువాడు
ఇంతిం తనరాని మహిమ నెగడుచుండు వాడు
సాకారబ్రహ్మమని సకలవేదాంతులును
సాకేతమును జేరి చక్కగ పొగడ
భూకాంతుడై వాడు పొలుపుగా గద్దెనెక్కి
పాకారి ప్రముఖులును ప్రస్తుతించగ నిదిగో
ఎల్లవారి నుధ్ధరించ నిదే తగిన మంత్రము
ఎల్లవారి నుధ్ధరించ నిదే తగిన మంత్రము
కల్లగాని దివ్య మహిమకల రామమంత్రము
కల్లకపట మెఱుగనట్టి కడు మంచివారిని
కల్లలాడకుండ ప్రొద్దు గడపలేని వారిని
చల్లగాను కాచునట్టి చక్కనైన మంత్రము
ఎల్లెడలను ఘనకీర్తి నెసగెడి యీ మంత్రము
పంచేంద్రియములగెల్చిన పరమతేజస్విని
పంచమలపరాభూత పామరచేతస్కుని
యంచితముగ నొక్కరీతి నాదరించు మంత్రము
సంచితాదులణచి ప్రోచు చక్కనైన మంత్రము
ఇంత గొప్ప మంత్ర మేల నెఱుగకున్నారో
చింతలన్ని తొలగు విధము చింతించలేరో
అంతకుడిటు వచ్చు లోన ఆలోచించండి
ఇంతకన్న మంచి మంత్ర మింకొక్కటి లేదు
22, మే 2019, బుధవారం
హరినామ సంకీర్తనామృతంబును
హరినామ సంకీర్తనామృతంబును
మరువక గ్రోలరో మానవులారా
అష్టాక్షరి కష్టమని యనుచున్నారా
కష్టమా రామ యని కమ్మగా పలుక
ఇష్టాక్షరి మంత్రమిది ఈ రెండక్షరాలు
దుష్టభవలతలను త్రుంచు కత్తులు
ఒక్క హరినామమే చక్కని మందు
మిక్కిలియగు కలిబాధ నుక్కడగించ
ఒక్కసారి చవిజూచి యుర్వినెవ్వరు మా
కక్కర లేదనరు శ్రీహరినామౌషధము
తరచుగా గ్రోలి మీరు ధన్యులు కండు
హరినామ మందు రుచిమరగినవారు
మరలపుట్టు పనిలేదు మరువబోకుడు
నరులార త్వరపడుడు త్వరపడుడు
21, మే 2019, మంగళవారం
చిక్కునో దొంగల చేతికి తాళాలు
చిక్కునో దొంగల చేతికి తాళాలు
మక్కువతో చేరునో మంచివారిని
తెలుగువారి యదృష్టము తెలంగాణ కొంతగ
తెలిపినది దానజేసి తెలియవచ్చె
తలరాత ప్రకారమే తలపులు జనులకని
కలిగినదే మేలను కలన వా రుందురని
సమయ మాసన్నమాయె సరిజూడ యాంద్రులకు
విమలోదారబుద్ధి విభవ మెట్టిదో
ప్రమత్తులై యాశపోతు రాయళ్ళను రప్పింతురొ
తమకు మేలు చేయు వారి తప్పక గమనింతురో
కర్మము నడిపించు రీతి కలుగు జనుల బుధ్ధులు
నిర్మమలై దైవముతా నెగడు గాక
ధర్మాధర్మములు వ్యత్యస్తమగునొ మానునో
మర్మ మెఱిగినది నీవె మహిని రామచంద్రుడా
20, మే 2019, సోమవారం
శ్రీరామచంద్రుని చేరి వేడక
శ్రీరామచంద్రుని చేరి వేడక
వేరెవరిని వేడెదవో వెఱ్ఱివాడ
ఎవోవో జన్మలలో కావించినవి
నీవంటిని చేయగా నిప్పుల కొలిమి
ఈ వేళ బుద్ధి వచ్చి ఎవ్వరినయ్యా
నీవు వేడగలవురా నేడు శరణము
తెలివిలేక బ్రతుకంతా తుళువలతోడి
చెలిమి వలన పూర్తిగా చెడిపోయినదా
కలలోన యముడు కూడ కనబడినాడా
యిల నెవ్వరి శరణు వేడ నెంచెదవీవు
అడిగో శ్రీరామ చంద్రు డతిమంచి వాడు
వడివడిగా నడువరా వాని చెంతకు
అడుగరా అభయము నీ కాతడె దిక్కు
కడముట్టును కష్టములు కలుగు మోక్షము
17, మే 2019, శుక్రవారం
నమ్మరాని లోకమును నమ్మి
నమ్మరాని లోకమును నమ్మి భంగపడితి
నమ్మదగిన నిన్ను నేను నమ్మక చెడితి
పలికినట్టి పలుకు లేవొ పలికితిని పలుగాకి
వలె నిపుడు రామజప పరుడ నైతిని
కలలనైన నీవు నా తలపులలో నిండగ
నిలువరించ రాని కలి నిలువలేక పారె నిదే
అయినదేమొ అయిన దని యనుకొందురా యింక
పయిన నీ మాటనే పాటించెదరా
నయముకాని రోగము నా లోకమోహ మిదే
నయమాయెనురా నీ నామసంకీర్తనమున
జరిగిన దేదో జరిగె చాల బాధల కిదే
తెర పడినది నీనామ స్ఫురణము కలిగి
మరల తప్పు దారులకు మరలిపోవక నన్ను
కరుణించవయ్య నీవు కమలాక్షుడా యింక
16, మే 2019, గురువారం
ఆగండాగం డీ కాగితపు పడవల
ఆగండాగం డీ కాగితపు పడవల దు
ర్యోగ మేల రామనౌకా భోగముండగ
ఇంతపెద్ద నౌకయుండ వింతవింత ప్రయాణము
చింతల పాలౌచు మీరు చేయనేల
ఎంతకాల మైన గాని ఎంతదూర మేగెదరో
యింతలో నంతలో నివి యెల్ల మునుగవో
ఈ నౌక నెక్కితే యెకాయెకీ గమ్యమే
కాని మజిలీల పేర కాలయాపన
లేనే లేదండి మీరు లేనిపోని శంకలకు
లోనుగాక రామనౌక లోన వచ్చిచేరండి
సదుపాయము లున్నది చాల పెద్ద నౌక యిది
ముదితులై వచ్చి మీరిది యెక్కుడు
పదేపదే పడవమారు పనిలేదు మీకింక
ఇదే మంచి యవకాశ మిదే మంచి ప్రయాణము
15, మే 2019, బుధవారం
భూతలమున జనులలో బుధ్ధిమంతులు
భూతలమున జనులలో బుధ్ధిమంతులు
సీతారామలక్ష్మణులను సేవింతురు
సేవింతు రెల్లపుడు సేవింతురు
సేవింతు రెల్లపుడు చిత్తజగురుని
దేవతల కష్టము తీర్చిన వాని
భావనాతీతుడై వరలెడు వాని
రావణాంతకుడైన రామచంద్రుని
సేవింతు రెల్లపుడు చిద్రూపిణిని
సేవకజన సద్గృహ చింతామణిని
పావనచరితయై భాసిల్లు సతిని
శ్రీవేదమాతను సీతమ్మను
సేవింతు రెల్లపుడు శేషావతారు
శ్రీవిభుని సేవలో చెలగెడు వాని
ధీవిశాలు హరిభక్తి దివ్యాకృతిని
పావనుని లక్ష్మణ స్వామి నెలమిని
13, మే 2019, సోమవారం
సాకారబ్రహ్మమును సందర్శించ
సాకారబ్రహ్మమును సందర్శించ
నీ కోరిక తీరు శబరి నేడోరేపో
సతిని వెదకికొనుచు రామచంద్రుడై వచ్చు
నతివ శ్రీహరి శేషు డనుజుడై వచ్చు
నతని లక్ష్మణు డండ్రు నా యిర్వుర నంత
అతిభక్తి గొల్చి చరితార్ధురాల వగుదువు
వినుము హరి దేవతలు విన్నవించగను
చనుదెంచెను రాముడై దనుజుల దునుమ
అనుగమించి సీతయై ఆదిలక్ష్మి వచ్చె
వనవాసము రామలీల వనితరో వినుము
వివిధవనఫలములతో విందొనరించి
ధవళాక్షుడు రాముని దయను పొందుము
అవల బ్రహ్మపదమునకు నరుగ వచ్చును
భువిని నీపేరు నిలచిపోవును నిజము
12, మే 2019, ఆదివారం
అమ్మా సీతమ్మా నిన్నే నమ్మితి
అమ్మా సీతమ్మా నిన్నే నమ్మితి మమ్మా మా
యమ్మా నీ చరణయుగళి నంటి మ్రొక్కేము
ప్రశమితాఖిలదనుజబలుడైన రాముని
యశమునకు మూలమో యమ్మా నీవే
దశరథుని కోడలా దశకంఠనాశినీ
కుశలవజనయిత్రి నీకు కోటిదండాలు
యింటి కావలివాడే యిలను రాకాసియై
యుంట నీవు కనుగొని యెంతోదయతో
తుంటరియగు వాని యింట దూరినావు
బంటుదిగులు తీర్చితివి బంగరు తల్లి
హరిబంటుల మగు మేము నజ్ఞానము చేత
ధరమీద నరులమై తిరుగాడు చున్నాము
పరమదయామయయీ మా బాధతీర్చవమ్మ
మరల హరిసన్నిథికి మమ్ము చేర్చవే
వచ్చేపోయే వారితో వాదులెందుకు
వచ్చేపోయే వారితో వాదులెందుకు వారు
మెచ్చకున్న లోటేమి మేదిని మనకు
భూమిని పుట్టేరు బోధలేక పెరిగేరు
కామాదులు చెప్పినట్లు గంతులేసేరు
నీమాట యెత్తితేనె నిప్పులే చెఱగేరు
సామాన్యులు వారితో చాలులే వాదాలు
రాముడిదే తప్పని రావణుడే గొప్పయని
యేమేమో వదరేరు యెఱుక చాలక
రాముడే లేడనుచు రంకెలే వేసేరు
రాముడా నీవు లేక రావణు డున్నాడా
అవకతవక సిధ్ధాంతా లనుసరించి చెడేరు
శివకేశవబేధాలే చెప్పికుళ్ళేరు
భవమోచన వారితో వాదులు చేసేనా
యివల నవల నున్న నిన్నెన్నిపూజించేనా
11, మే 2019, శనివారం
వట్టి వెఱ్ఱివాడ నని భావించేవో
వట్టి వెఱ్ఱివాడ నని భావించేవో నా
పట్టుదల నెఱుగవో పరమపూరుష
ఎన్నెన్ని జన్మలెత్తి యేమి లాభమోయి నే
నన్ని జన్మలందు కూడ నజ్ఞాని నైతి
నిన్నాళ్ళకు మోసమొఱిగి యింకపుట్ట నంటె యీ
చిన్న కోరికను గూర్చి యెన్నడు మాట్లాడవు
ఎంత గొప్ప వాడవైన నేమి లాభమోయి నా
చింత దీర్చువాడ వగుచు చెంత చేరక
రంతుకాడ నీ యాటల రహస్యమును తెలిసి నే
పంతగించి మాయనెల్ల భంగపరచి రానా
ఎందు నీవు దాగినను యేమి లాభమోయి నా
కందివచ్చి నీదు నామ మమరె నోటను
వందనము శ్రీరామబ్రహ్మమా నీ నామమె
యందించెను చింతదీరు నట్టి సదుపాయము
5, మే 2019, ఆదివారం
చాలు చాలు నీ కృపయే చాలును మాకు
చాలు చాలు నీ కృపయే చాలును మాకు
కాలునిచే భయమింక కలుగదు మాకు
కాముడనే రాక్షసుడు కదిసి కడుధూర్తుడై
మామీద పరచ మోహమార్గణమ్ముల
నేమి సాధనము మాకు నెదిరించ వానిని
రామనామ బాణమే రక్షణ మాకు
తామసత్వము చేత తప్పులే కుప్పలై
పామరులము చేసితిమి పాపము లెన్నో
పాములై ప్రారబ్ధఫలములు పైకొన్నచో
రామనామ కవచమే రక్షణ మాకు
భూమిమీద కష్టములు పుట్టలే పుట్టలై
యేమి సుఖము లేదాయె నించుకైనను
యేమి యుపాయము లేని సామాన్య జనులము
రామనామ మంత్రమే రక్షణ మాకు
రాముడా నీకృపను రానీయవయ్య
రాముడా నీకృపను రానీయవయ్య మేము
సామాన్యులము సంసారజలధిమగ్నులము
వేదశాస్త్రములలోని విషయంబు లెరుగము
వేదస్వరూపుడవై వెలుగొందు స్వామీ
మాదీనత కాస్త నీవు మన్నింపవలయును
నీ దయాలబ్ధి మాకు నిజమైన ధనము
పొట్టకూటి చదువులతో బుధ్ధి భ్రష్టుపట్టినది
వట్టిమాటలే కాని భక్తియేది స్వామీ
రట్టడి పను లింక మాన్పి రవ్వంత మంచిదారి
పట్టించవయ్య మమ్ము భగవంతుడా
నిండనీ మా గుండెల నీయందు సద్భక్తిని
పండనీ మాజన్మలు భవముదాటి స్వామీ
కొండంత దయగల గోవిందుడా నీవే
యండవై అభయమిచ్చి యాదరించవే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)