రాముని కన్నా చుట్టం బెవడే
రాలుగాయి మనసా నీకు
రాముని కన్నా ఆప్తు డెవ్వడే
భూమి మీద మనసా
చిక్కులు నిన్ను చుట్టుముట్టితే
చేరు మతని చెంత నీకు
దిక్కు తోచని దినమున వానికి
మ్రొక్కు లిడవె మనసా
మిక్కిలి దయగల వాడే రాముడు
నిక్కువ మిది మనసా నీకు
చిక్కులు చింతలు తీర్చి బ్రతుకునుచక్కజేయు మనసా
పనికిమాలిన పామరజనులను
కొనియాడకు మనసా నీవు
ఘనుడగు శ్రీరఘురామచంద్రుని
కొనియాడవె మనసా
ఉనికికి మనికికి రాముని దయ నీ
కున్నది కద మనసా వేగ
కనికరించి యిక మోక్ష మిమ్మని
తనను వేడవే మనసా
అది యొక్కటె నీవహర్నిశలును
హరి నడుగవె మనసా నీవు
అదిగా కన్యము లడిగి చెడకువే
అమాయకపు మనసా
మృదుస్వభావుడు రాముడు దయతో
మేలుచేయునే మనసా వాడు
సదమలపరమపదమ్మున నిన్ను
స్థాపించును మనసా