3, సెప్టెంబర్ 2025, బుధవారం

ఈశ్వరా


ఈశ్వరా మన్నించవయ్యా యెఱుక నా కందించవయ్యా
శాశ్వతంబగు పదము నందు చక్కగా నను నిల్పవయ్యా

ఏది మంచో యేది చెడుగో యెవ్వ డెఱుగు నీశ్వరా
నీదయా లేశమున గాక నిక్కముగ సర్వేశ్వరా

ఏది యల్పం బేదనల్పం బెవ్వ డెఱుగు నీశ్వరా
నీదయా లేశమున గాక నిక్కముగ సర్వేశ్వరా

ఏది న్యాయం బేది కాదో యెవ్వ డెఱుగు నీశ్వరా
నీదయా లేశమున గాక నిక్కముగ సర్వేశ్వరా

ఏది ధర్మం బేదధర్మం బెవ్వ డెఱుగు నీశ్వరా
నీదయా లేశమున గాక నిక్కముగ సర్వేశ్వరా

ఏది సత్య మేదసత్య మెవ్వ డెఱుగు నీశ్వరా
నీదయా లేశమున గాక నిక్కముగ సర్వేశ్వరా

ఏది నాదో యేది కాదో యెవ్వ డెఱుగు నీశ్వరా
నీదయా లేశమున గాక నిక్కముగ సర్వేశ్వరా

ఎవడు తనవా డెవడు పైవా డెవ్వ డెఱుగు నీశ్వరా
భువిని నీదయ వలన గాక పోల్చ తరమా యీశ్వరా

ఎవడు సజ్జను డెవడు దుర్జను డెవ్వ డెఱుగు నీశ్వరా
భువిని నీదయ వలన గాక పోల్చ తరమా యీశ్వరా

ఎవడు పండితు డెవడు పామరు డెవ్వ డెఱుగు నీశ్వరా
భువిని నీదయ వలన గాక పోల్చ తరమా యీశ్వరా

ఎవడు జ్ఞానియొ యెవడు జడుడో యెవ్వ డెఱుగు నీశ్వరా
భువిని నీదయ వలన గాక పోల్చ తరమా యీశ్వరా

ఎవడు యోగియొ యెవడు రాగియొ యెవ్వ డెఱుగు నీశ్వరా
భువిని నీదయ వలన గాక పోల్చ తరమా యీశ్వరా

ఎవడు నిన్ను రామునిగ గుర్తించ నేర్చెడు నీశ్వరా
భువిని నీదయ వలన గాక  పోల్చ తరమా యీశ్వరా