23, ఆగస్టు 2025, శనివారం

నామము చేయగదే


నోరా నామము చేయగదే తని
    వారా నామము చేయగదే


శ్రీరామ శ్రీరామ శ్రీరామా యని
    తారకనామము చేయగదే

ఊరక వ్యర్ధాలాపము లాడక 
    నోరా నామము చేయగదే


వారితో వీరితో వాదములకు దిగి 
    బడబడ వాగుచు నుండుటకు

మారుగ వారిజ నేత్రుని నామము 
    మరిమరి పలుకుచు నుండగదే


నారాయణుని పొగడక నీవు 
    నరులకు పొగడుచు నుండెదవే

ధారాళముగ రాముని పొగడుచు
    తారకనామము చేయగదే


దారినపోయే వారిని పిలచుచు
    దంభములాడుచు నుండెదవే

దారినిచూపే శ్రీరాముని భవ
    తారకనామము చేయదే