15, జూన్ 2025, ఆదివారం

గట్టిగా నమ్మండి

రమ్యగుణోపేతుడైన రాముడే దేవుడని
గమ్యము వైకుంఠమని గట్టిగా నమ్మండి

పట్టుపీతాంబరమును కట్టి సింహాసనమున
పట్టాభిరాముడైన వాడెపో బ్రహ్మమని
గట్టిగా నమ్మండి కమలాక్షుని పాదములు
పట్టుకొన్న తరింతుము భవవారాన్నిధి నని

కరుణాసముద్రుడైన హరియే శ్రీరాముడని
పరమాత్ముడు వాని దివ్యపాదములను పట్టిన
నరులకెల్ల మోక్షంబని నమ్మండీ నమ్మండి
పరమభాగవతుల దారి పట్టండీ పట్టండి

సొమ్ములను నమ్మకండి సుతుల సతుల నమ్మకండి
నమ్ముకోండి రామునొకని నారాయణు డతడండి
నమ్మి చెడినవారు లేరు నమ్మండీ నమ్మండి
నమ్మని వారికి వైకుంఠమ్మెక్కడి మాటండి