రండు రండు సుజనులార రాముని సభకు ఉ
ద్ధండులైన హనుమదాదు లుండెడు సభకు
భువనైకమాతయైన పుణ్యశీల యైన
అవనిజాత పతితో సింహాసనాసీనయై
వివిధరీతులుగ తనను విబుధులు పొగడ
నవుమోమున వినుట నానందింతము
జగదేకవీరుడైన జానకినాథు డైన
మగరాయడు సతితో మణిమకుటధారియై
సొగసుకాడు సురలు తన శోభను పొగడ
నగుమోమున వినుట నానందింతము
జయజయ శ్రీరామ యని జానకిరామ యని
వియచ్చరులు పౌరులును వేనోళ్ళ పొగడగ
జయశీలు డైన రామచంద్రుడు సభను
నయమొప్ప తీర్చుట నానందింతము