12, జూన్ 2025, గురువారం

తొలగనీ నాదైన్యము


నీదయచే తొలగనీ నాదైన్యము రామా

వేదవేద్య వేరేమి వేడెద నేడు


సురలు కోర కదలి వచ్చి చొచ్చి నరజాతిలో 

సురవైరుల పీచమడచి చూపితివే కరుణను

మరి యట్టి దయ నేడును మన్నించి నాపైన

కురిపించి నన్నేల కూడదా నేడు


కరి నాడు మొరలు పెట్ట కరుణించి వేగముగా

తరలివచ్చి మొసలి గొంతు తరిగితివే నీవు

మరి యిన్ని మొరలు పెట్టు మనుజుడ నాపైన

కురిపించ వేల దయను గోవింద నేడు


మరవనే భవతారకమంత్ర మొక్క నాడును

మరవనే మదిని నీదు మహిమ నేనాడును

మరవక నిను గొల్చు చుండు పరమభక్తుని నన్ను

పరాత్పరా కరుణ నేలవలె గదా నేడు