మధురభాషల చిన్ని కృష్ణ నీవు
మథురకు పోవద్దు కృష్ణ
మథురలో పనియుందే భామా నేను
మథురకు పోవలె భామా
మదురలో కంసుడు కృష్ణా నిన్ను
మననిచ్చునా వద్దు కృష్ణా
వధియింతు కంసుని భామా నేను
మథురకు పోవలె భామా
కథలుకథలుగ వింటి కృష్ణా వాడు
కఠినాత్ముడట చిన్ని కృష్ణా
వ్యథలకు మూలము భామా వాని
కథ తేల్చ బోవలె భామా
ఆధముడు వానితో కృష్ణా నీవు
ఆటలాడుట యేల కృష్ణా
విధి శంకరులు సాక్షి భామా వాని
విరిచివచ్చెద గొల్లభామా