3, మే 2025, శనివారం

జానకీనాథునకు

జానకీనాథునకు జయము జయము జయ మనరే
మానవేంద్రునకు జయమంగళ మనరే

కౌసల్యాతనయునకు కరుణాలవాలునకు
దాససంపోషకునకు ధర్మావతారునకు
వాసికెక్క రఘుకులము వసుధ నవతరించిన
శ్రీసతీరమణునకు చిన్మయాకారునకు

రావణాదికదైత్యప్రాణాపహారునకు
దేవముఖ్య వినుతునకు దివ్య ప్రభావునకు 
భావించ భక్తలోకపాలకుడై వెలసిన
శ్రీవరుడగు శౌరికి చిన్మయాకారునకు 

కాలస్వరూపునకు కమనీయరూపునకు
పాలితాఖిలభువనభాండునకు రామునకు
నీలమేఘదేహుడై నేల నవతరించిన
శ్రీలక్ష్మీవరునకు చిన్మయాకారునకు