నాతరమా భవసాగర మీదగ
నాతండ్రీ నను కావవయా
సీతారామా సద్గుణధామా
సీతారామా సద్గుణధామా
శ్రీరఘురామా కావవయా
అటునిటు తిరుగుచు నలసి పోయితిని
ఆదరించరా నాతండ్రీ
కుటిలజగంబున నిక నను త్రిప్పకు
కుటిలజగంబున నిక నను త్రిప్పకు
కోటిదండములు రామయ్యా
ఆనందముగా నీనామంబునె
యాలపించుదును నాతండ్రీ
ఏనాడును నది మరువని వానిగ
నెఱుగుదువే నను రామయ్యా
ఇనకులతిలకుడ వగు నీసరివా
రెవ్వరు గలరుర నాతండ్రీ
మనసున నిన్నే గురిగా నమ్మితి
మరి నను బ్రోవుము రామయ్యా
ఈశ్వర నీదగు దివ్యప్రభావము
నెంతని పొగడుదు నాతండ్రీ
శాశ్వతమగు నీకీర్తిని పాడుచు
జరుపుదు దినములు రామయ్యా
ఉర్వీతలమున రామరాజ్యమున
కున్న ప్రశస్తిని నాతండ్రీ
సర్వకాలముల నన్ని దిక్కులను
జనులు పొగడుదురు రామయ్యా
ఊరక పుట్టుచు నూరక చచ్చుచు
నుండుట దేనికి నాతండ్రీ
వేరడుగను నను నీదరి నుండగ
పిలువబంపరా రామయ్యా
ఎవరిట మెచ్చిగ నెవరిట దిట్టిగ
నేమిటి కయ్యా నాతండ్రీ
భువనేశ్వర నీవొకడవు మెచ్చిన
పొంగుదు మిక్కిలి రామయ్యా