తరచుగ శ్రీహరినామము పలికే
ధన్యాత్ములు మీరెవరండీ
హరిహరి యనుచు తరించదలచే
హరిభక్తులము మేమండీ
తరచుగ శ్రీహరిసేవల నుండే
ధన్యాత్ములు మీరెవరండీ
హరిసేవలకే యంకితమగు శ్రీ
హరికింకరులము మేమండీ
తరచుగ శ్రీహరిగాథలు చెప్పే
ధన్యాత్ములు మీరెవరండీ
హరికథలను వినిపించుచు తిరిగే
హరిదాసులము మేమండీ
తరచుగ హరికీర్తనలను పాడే
ధన్యాత్ములు మీరెవరండీ
హరికీర్తనమే యానందమనే
హరిజీవనులము మేమండీ
తరచుగ హరిపూజలలో గడిపే
ధన్యాత్ములు మీరెవరండీ
హరిపూజలతో తరించదలచే
హరిభక్తులము మేమండీ
తరచుగ హరిక్షేత్రంబులు తిరిగే
ధన్యాత్ములు మీరెవరండీ
హరితీర్ధములను సంచరించు శ్రీ
హరిభక్తులము మేమండీ
తరచుగ శ్రీహరిభజనలు చేసే
ధన్యాత్ములు మీరెవరండీ
హరేరామయను హరేకృష్ణయను
హరిభక్తులము మేమండీ
తరచుగ హరిపై కవిత్వమల్లే
ధన్యాత్ములు మీరెవరండీ
హరికే కవిత్వ మంకితమిచ్చే
హరికవులము మేమేనండీ