శ్రీరామరామా యనుచు చిత్త మలరగ
మీరెందుకు పాడ రిపుడు మిత్రులార
ఏనామము శ్రవణంబుల కింపు గూర్చునో
అనామము పాడ మీకు నాన దేనికో
ఏనామము శంకరునకు హితమైనదో
ఆనామము మీకెందుల కహితమైనదో
మంచిగాను భవరోగము మాన్పునామమే
కొంచెమైన మీకు సహియించ కున్నదే
పంచదార చేదే యను పైత్యరోగిలా
మంచి రామనామమే రుచించ దందురే
పాపములే రామాయన పారిపోవునే
శాపములే రామాయన చక్కబడేనే
తాపములే రామాయన తగ్గిపోవునే
మీపెదవులు రామాయన మీకు మోక్షమే