హరివి నీవు నరుని నన్ను
కరుణ నేల లేవా
పరమపురుష రామచంద్ర
దరికి జేర్చ లేవా
కరుణాతిశయముతో నీవు కరిని
దరిజేర్చిన దొక కల్లా
సురవైరిసుతుని కొర కీవు నాడు
నరసింహు డగుట కల్లా
పరమాదరమున సభలోన సతిని
కరుణించి నదియు కల్లా
మరి నీవు నన్ను కరుణించ వేమి
పరమాత్మ చెప్పవయ్యా
వరదానశీల సిరులిచ్చి నన్ను
కరుణించ మనను గాదా
కరుణాలవాల భరమాయె బ్రతుకు
కరుణించ మంటి గాని
శరణాగతత్రాణ బిరుదాంకితువు
శరణంటి బ్రోవరాదా
మరి యేమి చేయ నీమనసుకరుగు
హరి నీవె చెప్పవయ్యా