10, జనవరి 2025, శుక్రవారం

ఎందు కీయుపేక్ష


ఎందు కీయుపేక్ష రాఘవా

తొందర నీకేల లేదురా


చిందరవందరగ నున్న జీవితము నాదాయెను

వందారు సద్భక్తకోటిమందార దయామృత

బిందువొకటి నాపైపడవేసి రక్షసేయరా

వందనములు నీకు సర్వాత్మక దయజూపరా


ఎందరినో ప్రోచి నన్నేల నేల రావు వా

రందరి వలె నొక భక్తుడ ననిపించుట లేదా

ఇందీవరశ్యామ నాయందు తప్పేమిరా

వందనములు నీవు నాయందిక దయజూపరా


సందేహము దేనికి నిను శరణుజొచ్చి యుంటినే

సందడికా డీత డనుచు సరకుచేయ కుంటే

యెందుబోదు నింక దిక్కెవ్వరున్నారురా

వందనములు దేవదేవా యిక దయజూపరా