మరే యితర మంత్ర మెంత మచ్చికైన గాని
హరేరామ యననిదే యబ్బేనా ముక్తి
గురువులను కొలిచి వారు కొసరిన మంత్రాలు
పరమభక్తితోడ జిహ్వాగ్రంబున నిలిపి
తరచుగాను తద్దేవతలను ధ్యానించిన
సరాసరిగ ముక్తిలేదు హరేరామ యనక
నిరంతరము జపతపాది నిష్టలను నెఱపి
పరమభక్తితోడ పునశ్చరణలు చేసి
పరమంత్రంబుల నెంతగ భావించిన గాని
హరేరామ యనక భవతరణము లేదు
హరేరామ హరేకృష్ణ హరేవాసుదేవ
హరేమురారే యనెడు నరునకు ముక్తి
కరతలామలకమై వరలుచు నుండు
హరినామము దక్క మంత్ర మనునది లేదు