7, జనవరి 2025, మంగళవారం

ఎవరైనా శ్రీరామభక్తులై


ఎవరైనా శ్రీరామభక్తులై యెందు కుందు రయ్యా

భువిలో శ్రీహరిభక్తులె జీవన్ముక్తు లండ్రు గనుక


ఎవరైనా శ్రీరామచరితమే యెందుకు చదివే రయ్యా

భువిలో దివిలో నదియే మిక్కిలి పుణ్యచరిత గనుక

ఎవరైనా శ్రీరామచంద్రునే యెందుకు కొలిచే రయ్యా

భువిలో దివిలో దేవుడు శ్రీరఘుపుంగవుడే గనుక


ఎవరైనా శ్రీరాముని కీర్తన మెందుకు చేసే రయ్యా

స్తవనీయుడు శ్రీరామచంద్రుడే సర్వేశుడు గనుక

ఎవరైనా శ్రీరామదాసులై యెందుకు బ్రతికే రయ్యా

వివరింపగ సద్భక్తుల కదియే వేడు కగును గనుక


ఎవరైనా శ్రీరామనామమే యెందుకు పలికే రయ్యా

భువిలో దివిలో దానికి సాటియె పొడగానము గనుక

ఎవరైనా ఆమోక్షమార్గమే యెందుకు వలచే రయ్యా

భువిలో దానికి సాటి మార్గమునె పొడగానము గనుక