7, జనవరి 2025, మంగళవారం

నీనామమును గాని


నీనామమును గాని నేను పలుకను స్వామి

నా నియమ మిట్టిది నారాముడా


నీకీర్తినే గాని నేను చాటను స్వామి

నీకు సాటిగ నొరుని నేనెన్నను

నీకరుణనే గాని నేను వేడను స్వామి

నాకితరము లేల నారాయణా


నీపాటలే గాని నేను పాడను స్వామి

ఆపాట లణచు నాతాపంబులు

నీపాదములు గాక నేను పట్టను స్వామి

ఆపాదములు భవహరణంబులు


నీవారితో గాని నేను తిరుగను స్వామి

నీవారె నావారు నిక్కంబుగ

నీవిచ్చు మోక్షమే నేను కోరుదు స్వామి

పైవారితో నాకు పనిలేదయా