రామరామ యన వేలా శ్రీరఘురాముని కొలువ వదేలా
రామనామమును మించిన మంత్రము భూమిని లేదని చక్కగ నెఱిగియు
రామనామమును చేసిన జీవులు రయముగ మోక్షము పొందుట నెఱిగియు
రామదాసులకు సర్వసంపదలు రాముడు తప్పక నిచ్చుట నెఱిగియు
రామదాసులకు రాముడె యోగక్షేమము లరయుచు నుండుట నెఱిగియు
రామనామమును శివుడే నిత్యము ప్రేమగ ధ్యానము చేయుట నెఱిగియు
రామనామమును పలికిన వినినను రోమహర్షణము కలుగుట నెఱిగియు
రాముడు శ్రీమన్నారాయణుడని బ్రహ్మాదులు ప్రకటించుట నెఱిగియు
రాముని కన్నను దైవము లేడని భూమినందరును పొగడుట నెఱిగియు
బ్రహ్మాదికసురపూజ్యుడు రాముడు భగవంతుం డని బాగుగ నెఱిగియు
బ్రహ్మానందము రామనామమును పాడుటలోనే కలదని యెఱిగియు
సర్వకాలముల రామనామమును చక్కగ జేయగ దగునని యెఱిగియు
సర్వాత్మకుడగు రాముం డొక్కని శరణము జొచ్చిన చాలని యెఱిగియు