వదలి తలిదండ్రులను కదలినాడు రాఘవుడు
వదలి సింహాసనమును కదలినాడు రాఘవుడు
వదలి తన పురజనులను కదలినాడు రాఘవుడు
కదిలినాడు రాఘవుడు కానలకు రాముడు
వదలి సుఖభోగములను కదలినాడు రాఘవుడు
వదలని చిరునగవులతో కదలినాడు రాఘవుడు
మదగజ గమనంబుతోడ కదలినాడు రాఘవుడు
కదలినాడు రాఘవుడు కానలకు ధీరుడై
వదలి అంతఃపురంబును కదలినది సీతమ్మ
వదలి యత్తమామలను కదలినది సీతమ్మ
వదలక పతి యడుగుజాడ కదలినది సీతమ్మ
కదలినది సీతమ్మ కానలకు మగనితో
వదలి పత్ని యూర్మిళ నిట కదలినాడు లక్ష్మణుడు
వదలలేక తన యన్నను కదలినాడు లక్ష్మణుడు
వదలక నిజక్రోధమును కదలినాడు లక్ష్మణుడు
కదలినాడు లక్ష్మణుడు కానలకు భ్రాతతో
కదలిపోవు పురసిరితో కదలిపోయె పురమెల్ల
కదలిపోవు రామునితో కదలిపోయె పురమెల్ల
కదలిపోవు బిడ్డలతో కదలిపోయె పురమెల్ల
కదలిపోయె పురమెల్ల కానలకు వారితో