రామనామము మరచి తిరిగితివి నీవు పామరుడవై మిగిలి పోయితివి
రామనామము కంటె ముఖ్యం బేమి కలదీ భూమి మీదను
కాసులను లెక్కించు కొనుటకు కాలమెంతయు చాలకుండిన
వాసవాదివినుతుడు శ్రీపతి భజనచేయుట కేది సమయము
వీసమంతయు భక్తిజూపక విష్ణుదేవుని భజనచేయక
కాసు లగలగలలు వినుచును కడకు ముక్తికి దూరమైతివి
కామినులపై మోహమును గొని కాలమంతయు గడపుచుండిన
స్వామి నారాయణుని భజన సలుపుటకు నీ కేది సమయము
ప్రేమమీఱగ భక్తిజూపుచు విష్ణుదేవుని భజనచేయక
కాముకుడవై సంచరించుచు కడకు ముక్తికి దూరమైతివి
నీమముగ ముక్కాలములు శ్రీరామనామము చేయువారికి
కామితంబగు మోక్షమిచ్చుచు కరుణజూపును రామచంద్రుడు
తామసత్వము పెచ్చుమీఱగ రామనామము జిహ్వనుంచక
భూమిని చరియించుచుండెడు పామరుడ విక మోక్ష మెక్కడ