కం. రాము డిచ్చు ధనము రాము డిచ్చు జయము
రాము డిచ్చు నందరాని ముక్తి
రామభజన చేయ రండు సుజనులార
భూమి నింక పుట్టబోరు మీరు.
ఓ సజ్జనులారా!
వినండి.
మీకు ధనధాన్యాలు కావాలా?
ఆవి రాము డిస్తాడు.
మీకు సకలకార్యాలలోనూ విజయం కావాలా?
అదీ రాముడే ఇస్తాడు.
అసలు మీకొక సంగతి తెలుసునా?
ఏది కావాలన్నా రాముడే ఇస్తాడు.
ఎవరికి కావాలన్నా రాముడే ఇస్తొడు.
చివరకు మీరు దుర్లభమైన మోక్షం కావాలన్నా సరే రాముడు తప్పకుండా ఇస్తాడు.
రండి.
అందరూ రండి.
ఈరాముణ్ణి భజించండి.
భజన అంటే తప్పట్లు కొడుతూ పాటలు పాడటం ఒకటే కాదండోయ్.
భజ్ సేవాయాం అన్నారు.
అంటే రాముణ్ణి అన్ని విధాలుగానూ సేవించటం అన్నమాట రామభజన అంటే.
రండి రాముణ్ణి సేవించండి.
నమ్మండి. ఇంక మీరు మళ్ళా జన్మించే పనే లేదు.