ఆ.వె. రాత ఘనుడు రమణ గీత ఘనుడు బాపు
రాత గీత భువిని రాజ్యమేలె రాత నిన్న చనెను గీత నేడు చనెను రాత గీత దివిని రాజ్యమేలు కం. రావోయీ బాపూ అని
తా వాత్సల్యంబు మీఱ దశరథసుతుడా
కైవల్యము నిచ్చుటకై
రావించుకొనెను రమణను రమ్మన్నట్లులే
ఆ.వె. బాపు రమణ లేని వసుధనే మెచ్చడు
రమణ బాపు లేక రమణ కాడు
రమణ ముందుగానె రాముని చేరగా
బాపు చేరె రామ పాద మిపుడు
శా. ఓ బాపూ భవదీయమైన తను వీ యుర్విన్ విసర్జించినన్ నీ బొమ్మల్ తెలుగిళ్లకిచ్చితివి పోని మ్మంతియే చాలులే నీ బంగారు కలంబు చూపగల వన్నెల్ చిన్నెలున్ స్వర్గమం దే బాగొప్పగ నాంధ్రమాత యశమున్ హెచ్చింపగా వెల్గుమా |
(పై బొమ్మ ఆంధ్రజ్యోతివారి సౌజన్యంతో)